మేఘా చేతికి 15 సిటీ గ్యాస్‌ ప్రాజెక్టులు

15 Jan, 2022 08:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డ్‌ (పీఎన్‌జీఆర్‌బీ) నిర్వహించిన 11వ రౌండ్‌ బిడ్డింగ్‌లో అత్యధిక సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్ట్‌లను  మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) దక్కించుకుంది.  పీఎన్‌జీఆర్‌బీ 19 రాష్ట్రాల్లోని 215 జిల్లాల్లో విస్తరించిన 65 జియోగ్రాఫికల్‌ ఏరియాలకు బిడ్స్‌ నిర్వహించింది. 61 ఏరియాలకు బిడ్స్‌ దాఖలు అయ్యాయి.   ఇందులో మేఘా గ్యాస్‌ 15, అదానీ టోటల్‌ గ్యాస్‌ 14, ఐఓసీఎల్‌ 9, బీపీసీఎల్‌ 6 పొందగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు చేజిక్కించుకున్నాయి.   మొత్తం జియోగ్రాఫికల్‌ ఏరియాల్లో 24.6 శాతం వాటాతో ఎంఈఐఎల్‌ అగ్రభాగాన ఉంది.   దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. 61 జియోగ్రాఫికల్‌ ఏరియాలకు సుమారు రూ.80,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని పీఎన్‌జీఆర్‌బీ భావిస్తోంది.  


ఇప్పటికే పలు జిల్లాల్లో మేఘా..: కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో  సీజీడీ ప్రాజెక్టులను మేఘా గ్యాస్‌ దక్కించుకుంది.  తెలంగాణలో జోగులాంబ గద్వాల్, నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట,  వనపర్తి జియోగ్రాఫికల్‌ ఏరియాలు ఉన్నాయి. ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో  పైప్‌లైన్‌ నిర్మాణంతోపాటు 32 సీఎన్‌జీ స్టేషన్లను మేఘా గ్యాస్‌ ఏర్పాటు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తూముకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడంతోపాటు వాహనాలకు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ను మేఘా అందిస్తోంది.   
 

మరిన్ని వార్తలు