‘మేఘా’కు మంగోలియా ప్రాజెక్ట్‌

4 Nov, 2022 05:00 IST|Sakshi
ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్న మంగోల్‌ రిఫైనరీ ఈడీ అల్టాంట్‌సెట్‌సెగ్, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ (హైడ్రోకార్బన్స్‌) పి. దొరయ్య

ఆయిల్‌ రిఫైనరీ నిర్మాణ కాంట్రాక్ట్‌

విలువ 790 మిలియన్‌ డాలర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయంగా తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్‌ డాలర్లు. మంగోల్‌ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్‌వోఏ (లెటర్‌ ఆఫ్‌ ఆఫర్‌ అండ్‌ యాక్సెప్టెన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్‌ తెలిపింది.

ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్‌ ఆర్ట్‌ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్‌ టన్నుల ముడి చమురును ప్రాసెస్‌ చేయవచ్చు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది.

దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్‌ ఇండియా (ఈఐఎల్‌) ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్‌ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్‌ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.

మరిన్ని వార్తలు