స్పాన్సర్‌ బ్యాంకుల్లో గ్రామీణ బ్యాంకుల విలీనం!

25 May, 2021 00:25 IST|Sakshi

బలహీన ఆర్‌ఆర్‌బీలపై కేంద్రానికి ఏఐబీఈఏ లేఖ

న్యూఢిల్లీ: పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా బలహీన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్‌ఆర్‌బీ) స్పాన్సర్‌ బ్యాంకుల్లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ఆర్‌ఆర్‌బీలను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టనున్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాసినట్లు ఏఐబీఏఈఏ తెలిపింది. ‘ఆర్‌ఆర్‌బీలను స్పాన్సర్‌ బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల స్పాన్స్‌ బ్యాంకులకు గ్రామీణ నెట్‌వర్క్‌ మరింతగా పెరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌బీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న బలహీనతలను కూడా తొలగించవచ్చు‘ అని పేర్కొంది.

బ్యాంకులో భాగంగా మారడంతో పాటు నేరుగా స్పాన్సర్‌ బ్యాంకు మేనేజ్‌మెంట్‌లోకి రావడం వల్ల మరింత సమర్ధమంతంగా పర్యవేక్షించడానికి వీలవుతుందని ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ఆర్‌ఆర్‌బీలు అందిస్తున్న సేవలు ప్రశంసించతగ్గవే అయినప్పటికీ వాటి వ్యాపార స్వభావరీత్యా అవి బలహీనంగానే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా.. పలు అంశాల కారణంగా అంత ఆశావహ ఫలితాలు రావడం లేదని వెంకటాచలం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బలహీనంగా ఉన్న ఆర్‌ఆర్‌బీలను స్పాన్సర్‌ బ్యాంకుల్లో విలీనం చేయడం శ్రేయస్కరం కాగలదని పేర్కొన్నారు.

 
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రైతులు, వ్యవసాయ కూలీలకు రుణాలు, ఇతరత్రా ఆర్థిక సర్వీసులను అందించేందుకు ఆర్‌ఆర్‌బీ చట్టం 1976 కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. చట్టం ప్రకారం వీటిలో కేంద్రానికి 50 శాతం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు 15 శాతం, స్పాన్సర్‌ (ప్రమోటర్‌) బ్యాంకులకు 35 శాతం వాటాలు ఉంటాయి. అప్పట్లో 196 ఆర్‌ఆర్‌బీలు ఉండగా.. కాలక్రమేణా వీటి సంఖ్య 43కి తగ్గింది. 

మరిన్ని వార్తలు