‘మంచి రోజులు వచ్చాయి’.. లేఆఫ్స్‌ ఉద్యోగులకు బంపరాఫర్‌!

26 Sep, 2023 13:53 IST|Sakshi

ఈ ఏడాది మాస్ లేఆఫ్స్‌, పింక్ స్లిప్స్‌తో జాబ్ మార్కెట్ కుదేల‌వుతూ ఎటు చూసినా కొలువుల కోత‌లు క‌ల‌వ‌రానికి గురిచేశాయి. ఆర్ధిక మాంద్యం భ‌యాలు, మంద‌గ‌మ‌నంతో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్ట‌ప్‌ల వ‌ర‌కూ ఉద్యోగుల‌ను ఎడాపెడా తొల‌గించాయి. అయితే తొలగించిన ఉద్యోగులను ఇప్పుడు ఆయా కంపెనీలు రా రమ్మని పిలుస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి

పలు నివేదికల ప్రకారం.. మెటా, సేల్స్‌ ఫోర్స్‌ సంస్థలు తొలగించిన ఉద్యోగుల్ని రీ హైయర్‌ చేసుకుంటున్నట్లు తేలింది. ఈ సందర్భంగా హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ సాండ్రా ఎస్క్యూర్ మాట్లాడుతూ.. కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి.

అనంతరం కొత్త ప్రాజెక్ట్‌లను డెడ్‌లైన్‌ లోపు పూర్తి చేయడం విఫలం అవుతున్నాయి. కాబట్టే సంస్థలు ఉద్యోగం నుంచి తీసేసిన సిబ్బందిని తిరిగి విధుల‍్లోకి తీసుకుంటున్నాయని అన్నారు. మాజీ ఉద్యోగులు తిరిగి సంస్థలో చేరేలా ఒప్పించడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌


మాజీ ఉద్యోగులకు పిలుపు
ఈ ఏడాది జనవరిలో సేల్స్‌ ఫోర్స్‌ సేల్స్, ఇంజనీరింగ్, డేటా క్లౌడ్ వంటి విభాగాల్లో 10 శాతం మేర అంటే సుమారు 3 వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారినే ఇప్పుడు మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపింది. ఉద్వాసన పలికే సమయంలో ఆ కంపెనీ సీఈవో మార్క్ బెనియోఫ్ ఉద్యోగులకు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. అమెరికాలో ఫైర్‌ చేసిన ఉద్యోగులకు కనీసం ఐదు నెలల జీతం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, మరో సంస్థలో ఉద్యోగం దొరికేలా సహాయంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. యూఎస్‌ మినహా ఇతర దేశాల చట్టాలకు అనుగుణంగా ఉద్యోగులకు ప్రయోజనాల్ని అందిస్తామని అన్నారు. 

మెటాలో ఉద్యోగుల తొలగింపు 
మెటా గతేడాది నవంబర్‌లో 11,000 మందిని తొలగించింది. ఈ ఏడాది మార్చిలో 10,000ని ఫైర్‌ చేసింది.  దీంతో నెలల వ్యవధిలో 21,000 మంది మెటా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.

అలాంటప్పుడు తొలగించడం ఎందుకో
ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు భారీ బోనస్ లు చెల్లించాలని నిర్ణయించుకున్నారు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్. అదే సమయంలో  పలువురు మాజీ ఉద్యోగుల్ని రీహైయర్‌ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తొలగించిన ఉద్యోగుల పనితీరు పట్ల సంతృప్తి చెందడం వల్లే తాము అలా చేశామని చెప్పారు. కానీ సీఈవో స్పందనపై ఉద్యోగులు అసంతృత్తిని వ్యక్తం చేశారు. పనితీరు బాగుంటే మమ్మల్ని ఎందుకు తొలగించారని గుసుగుసలాడుతున్నారు. కాగా, ఉన్న ఉద్యోగం ఊడి.. కొత్త ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్న మాజీ ఉద్యోగులు కంపెనీల రీహైయర్‌ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు.

చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్‌? అదేంటంటే?

మరిన్ని వార్తలు