ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ వాటికి కూడా! మరి మెటా కంపెనీ ఏమంటోందంటే..

22 Nov, 2021 09:55 IST|Sakshi

end to end encryption To FB Messenger And Instagram: పేరు మారినా.. తీరు మారుతుందా? అంటూ మెటా (ఫేస్‌బుక్‌ కంపెనీ) వ్యవహారశైలిపై విసుర్లు విసురుతున్నారు నెటిజనులు. పైగా కంపెనీ పేరు మారాక నష్టాలతో పాటు విమర్శలూ పెరిగిపోయాయి. ఈ తరుణంలో యూజర్ల భద్రతకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఇప్పట్లో తేవడం కష్టమేనని తేల్చేసింది మెటా. 


వాట్సాప్‌ తరహాలోనే మెటా సర్వీసులైన ఫేస్‌బుక్‌ మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులకు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ end-to-end encryption సేఫ్టీ ఫీచర్‌ను మెటా (ఫేస్‌బుక్‌ కంపెనీ) అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే!. తద్వారా యూజర్ల గోప్యత హామీని నెరవేర్చే ఆలోచనలో ఉంది. అయితే వచ్చే ఏడాదిలోనే ఈ సర్వీస్‌ను యూజర్ల దాకా తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడది మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 

వీలైతే 2023 నుంచే ఆ ప్రయత్నాలు మెటా కంపెనీ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యూజర్‌ సేఫ్టీకి సంబంధించిన ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు తేవడం కాస్త ఆలస్యం అవుతుందని మెటా సేఫ్టీ హెడ్‌ అయిన ఆంటీగాన్‌ డేవిస్‌ ‘ది టెలిగ్రాఫ్‌’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు మరో రెండేళ్లు పట్టొచ్చని ఆయన తేల్చేశారు. అయితే ఈ సర్వీస్‌ ద్వారా నేరాలకు అడ్డుకట్ట పడుతందనే వాదనను మాత్రం మెటా అంగీకరించదని డేవిస్‌ చెబుతున్నారు.

   

మరోవైపు పిల్లల భద్రతకు సంబంధించి(ఇన్‌స్టాగ్రామ్‌) మెటాపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో.. విమర్శలకు చెక్‌ పెట్టేందుకైనా  E2EE సేవల్ని వీలైనంత త్వరగతిన అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా యూజర్ల ఛాటింగ్‌ చాలా భద్రంగా ఉంటుందని whatsapp తొలి నుంచి ప్రకటించుకుంటోంది. అయితే నేరాలు జరిగిన సమయంలో వారెంట్‌ జారీ అయినప్పుడు..  నేరం ఆరోపించబడ్డ వ్యక్తి ‘ఎన్‌క్రిప్షన్‌ యాసెస్‌’కు అనుమతులు ఇచ్చే చట్టాలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తలొగ్గాల్సిందేనని కొన్ని దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వీటిలో భారత్‌, జపాన్‌, కెనడా, న్యూజిలాండ్‌, యూకే ఉండగా..  కిందటి ఏడాది ఈ దేశాలతో అమెరికా కూడా గళం కలిపింది.

చదవండి: ఎలక్ట్రిక్‌ బ్రెస్ట్‌ మసాజర్‌! ఎలా పని చేస్తుందంటే..

మరిన్ని వార్తలు