ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!

6 Oct, 2023 12:17 IST|Sakshi

కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసింది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా కొంతమంది మీద ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేఆప్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ ఏడాది ప్రారంభం నుంచి వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మెటా సైతం ఇప్పటి వరకు సుమారు 20వేలమందిని ఇంటికి పంపింది. ఇందులో ఒక ఉద్యోగి లేఆప్స్ మీద తన అసహనం ప్రదర్శిస్తూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టింది.

జాబ్ పోయి 201 రోజులు (ఆరు నెలల కంటే ఎక్కువ) అవుతోంది, ఇప్పటికి ఒక్క అవకాశం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనుషులతో కలవడం పూర్తిగా తగ్గిపోయిందని, పని వాతావరణం మిస్ అవుతున్నట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాలు ఫేస్‌బుక్‌లో టెక్నికల్ రిక్రూటర్‌గా పని చేసిన యువతి ఈ పోస్ట్ చేసింది. ఆగిపోయిన చోటే నిలిచిపోయానని, త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందనే ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ

ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తూ తమ అసహనం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మెటా సంస్థ మాత్రం ఇప్పటికి తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు