మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపులు?

12 Feb, 2023 16:39 IST|Sakshi

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా  గత ఏడాది నవంబరులో 13శాతంతో  11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా మరికొంత మందిని తొలగించే  యోచనలో ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఫైనాన్షియల్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. గత కొన్ని వారాలుగా విభాగాలకు కేటాయించే బడ్జెట్‌తో పాటు,  హెడ్‌ కౌంట్‌ విషయంలో అస్పష్టత నెలకొందంటూ మెటాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చెప్పినట్లు తెలిపింది. ఇదే అంశంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. 

కొద్దిరోజుల క్రితం మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ టీం లీడర్లు, డైరెక్టర్లను తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ఈ ఏడాదిని సమర్ధత కనబరిచే సంవత్సరంగా (year of efficiency) అభివర్ణించిన జుకర్‌ బర్గ్‌... పైన పేర్కొన్నట్లుగా ఉన్నత స్థాయి ఉద్యోగులు వర్క్‌ విషయంలో వ్యక్తి గతంగా శ్రద్ద వహించాలని లేదంటే సంస్థను వదిలి వెళ్లిపోవచ్చని అన్నారు. దీంతో పాటు పనితీరు తక్కువగా ఉన్న ప్రాజెక్టులను షట్‌డౌన్‌ చేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్‌లలో లీమ్‌ లీడర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించేందుకు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది గడ్డు కాలమే 
గత ఏడాది సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు అందించిన విషయం తెలిసింది. ఆ కోతలు ఈ ఏడాదిలో సైతం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్లు అంచనా. ఇటీవలే టిక్‌టాక్‌ ఇండియా భారత్‌లోని తమ ఉద్యోగులందరినీ తొలగించింది. యాహూ 1,600 మందిని, డెల్‌ 6,500 మందిని ఇంటికి సాగనంపాయి. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు కలిపి దాదాపు రూ.50,000 మందిని తొలగించాయి.

మరిన్ని వార్తలు