వాట్సాప్‌లో మరో ఫీచర్‌.. ఇకపై క్రిప్టో కరెన్సీ కూడా

9 Dec, 2021 21:05 IST|Sakshi

వివాస్పద క్రిప్టో కరెన్సీ విషయంలో మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మెటాకు చెందిన వాట్సాప్‌ ద్వారా క్రిప్టో లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పైలట్‌ ప్రాజెక్టుగా కొంత మంది యూజర్లకు నోవి పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

క్రిప్టో కరెన్సీ చట్ట బద్దతపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వాల అజమాయిషీ లేని ఈ కరెన్సీ వల్ల ఆర్థిక గందరగోళ పరిస్థితుల తలెత్తుతాయని చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టెక్నాలజీ దిగ్గజాలు భవిష్యత్తు క్రిప్టో కరెన్సీదే అంటున్నారు. ఎలన్‌మస్క్‌, టిమ్‌కుక్‌ లాంటి టెక్‌సావీలు ఇందులో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో క్రిప్టో లావాదేవీలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.

మెటా సంస్థ అమెరికాలో ఎంపిక చేసిన యూజర్ల వాట్సాప్‌లలో నోవి ఫీచర్‌ను జోడించింది. నోవీ ఫీచర్‌లోకి వెళ్లి సంబంధిత సమాచారం అందివ్వాల్సి ఉంటుంది. సమాచార గోప్యత పాటించడంతో పాటు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌గా ఈ ఫీచర్‌ ఉంటుంది. ఇందులో యూఎస్‌ డాలర్లను ఎంటర్‌ చేస్తే డిజిటల్‌ కరెన్సీలోకి మారుస్తుంది. ఈ పనిని పాక్సోస్‌ ట్రస్ట్‌ అనే చట్టబద్ధమైన కంపెనీ నిర్వహిస్తుంది. 

ఇప్పుడు నోవి వాలెట్‌లో ఉన్న మనీ ద్వారా క్రిప్టో లావాదేవీలను జరుపుకునే వీలుంది. ఆరు వారాల క్రితం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీలను మెటా నిశితంగా పరిశీలిస్తోంది. క్రిప్టో లావాదేవీలను మరింత మెరుగు పరచడం ఎలా అంశాలపై ఫోకస్‌ చేసింది. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా అందరికీ అందుబాటులోకి తేవాలా ? లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. 
 

మరిన్ని వార్తలు