మెటా హెచ్చరిక.. అవసరమైతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిపివేస్తాం!

7 Feb, 2022 21:31 IST|Sakshi

యూరప్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను నిలిపివేసే ఉద్ధేశంలో ఉన్నట్లు మెటా తాజాగా విడుదల చేసిన వార్షిక నివేధికలో ఈ విషయాన్ని మెటా స్పష్టం చేసింది. యూరప్ యూజర్ల డేటాను అమెరికాలోని మెటా సర్వర్లకు బదిలీ చేయకుండా 2020లో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. యూజర్ల డేటాను అమెరికాలోని మెటా సర్వర్లకు బదిలీ చేయడానికి యూరప్ దేశాలు ఒప్పుకోకపోతే "యూరప్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలతో సహా మా అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు, సేవలను అందించలేకపోవచ్చు" మెటా తెలిపింది.యూజర్ డేటా విషయంలో సోషల్ మీడియా సంస్థ, చట్టసభ సభ్యుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను వార్షిక నివేధికలో సంస్థ హైలైట్ చేసింది. 

డేటా ప్రైవసీ పేరుతో వినియోగదారుల డేటాను అమెరికా సర్వర్లకు తరలించకుండా అడ్డుకోవడం సరైన పద్దతి కాదని సంస్థ వాదిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల తాము అక్కడి వినియోగదారులకు సేవలను అందిచలేమని.. అటువంటి పరిస్థితి వస్తే యూరప్‌లోని తమ వ్యాపారం నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వెల్లడించింది. కొత్తగా తీసుకొస్తున్న చట్టాన్ని వ్యాపార అనుకూలంగా ఉండేలా చూసేందుకు మెటా సంస్థ అమెరికా ప్రభుత్వం తరఫు నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తమ సేవలను నిరంతరాయంగా, వినియోగదారులను టార్గెట్ చేసుకుని యాడ్లను ప్రమోట్ చేయడంలో.. డేటా ట్రాన్ఫర్ ఎంత ముఖ్యమైనదో యూరోపియన్ ప్రభుత్వానికి, కోర్టులకు వివరిస్తోంది. కొత్త ఈయు నియమాలు ఫేస్‌బుక్ అందించే సేవలు, ప్రకటనలపై ఆధారపడే ఐరోపాలోని చాలా వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని సంస్థ తెలిపింది. 

(చదవండి: అచ్చం సినిమా తరహాలో మనిషి ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్..!)

మరిన్ని వార్తలు