డేటాకు ‘మెటావర్స్‌’ దన్ను..

19 Feb, 2022 05:46 IST|Sakshi

పదేళ్ళలో 20 రెట్లు పెరగనున్న వినియోగం

జియో, ఎయిర్‌టెల్‌కు మంచి అవకాశం

క్రెడిట్‌ సూసీ నివేదిక

న్యూఢిల్లీ: డిజిటల్‌ వ్యవస్థ క్రమంగా మెటావర్స్‌ వైపు మళ్లుతున్న నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది 20 రెట్లు వృద్ధి చెందనుంది. దేశీయంగా కూడా ఇదే ధోరణి కారణంగా.. టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. క్రెడిట్‌ సూసీ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.

వర్చువల్‌ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగించే మెటావర్స్‌ వల్ల యూజర్లు స్క్రీన్‌ చూడటంపై వెచ్చించే సమయం పెరగనుండటంతో.. డేటా వినియోగానికి గణనీయంగా ఊతం లభిస్తుందని పేర్కొంది. ‘ఇంటర్నెట్‌ వినియోగంలో 80 శాతం భాగం వీడియోలదే ఉంటోంది. ఇది వార్షికంగా 30 శాతం మేర వృద్ధి చెందుతోంది. మెటావర్స్‌ను ఒక మోస్తరుగా వినియోగించినా .. దీనివల్ల డేటా యూసేజీ, వచ్చే దశాబ్దకాలంలో ఏటా 37 శాతం చొప్పున వృద్ధి చెంది, ప్రస్తుత స్థాయి కన్నా 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక తెలిపింది. మెటావర్స్‌కి సంబంధించిన ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వంటి టెక్నాలజీల వినియోగం భారీగా పెరగనుందని వివరించింది.  

బ్రాడ్‌బ్యాండ్‌ లభ్యత కీలకం..
మెటావర్స్‌ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ లభ్యత కీలకమని క్రెడిట్‌ సూసీ తెలిపింది. ప్రజలు రోజూ అత్యధిక సమయం మొబైల్‌ను వినియోగించే టాప్‌ దేశాల్లో భారత్‌ కూడా ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇక్కడ తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో దీని విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉంది. ‘భారతీయ టెల్కోల ఆదాయాలపై మెటావర్స్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ .. మెటావర్స్‌ ప్రేరిత డేటా వినియోగం దన్నుతో ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో భారతి ఎయిర్‌టెల్‌ (ఆదాయాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ వాటా 17 శాతం), జియో గణనీయంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాం‘ అని క్రెడిట్‌ సూసీ తెలిపింది.   

6జీతో మరింత ఊతం ..
మెటావర్స్‌ వ్యవస్థకు 5జీ టెలికం సర్వీసులు తోడ్పడనున్నప్పటికీ దీన్ని మరిన్ని అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చేందుకు 6జీ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మిగతా విభాగాలతో పోలిస్తే ఎక్కువగా గేమింగ్‌ సెగ్మెంట్‌లో మెటావర్స్‌ వినియోగం ఉండవచ్చని పేర్కొంది. దేశీయంగా గేమింగ్‌ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్లు, 4జీ డేటా సర్వీసుల కారణంగా అధిక స్థాయిలో గేమింగ్‌.. మొబైల్‌ ఫోన్ల ద్వారానే ఉంటోందని వివరించింది. ‘స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్‌ లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల ఆన్‌లైన్‌ వినియోగానికి భారత యూజర్లు.. మొబైల్‌ ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించి మొబైల్‌ గేమింగ్‌ వాటా భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి‘ అని క్రెడిట్‌ సూసీ పేర్కొంది.  

మరిన్ని వార్తలు