మెట్రో కారిడార్‌లలో ప్రాపర్టీ ధరల పెరుగుదల

17 Apr, 2021 19:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మూడు దశాబ్ధాల క్రితం ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాన నగరాన్ని, శివారు ప్రాంతాలతో అనుసంధానం చేయడంతో దీని వినియోగం బాగా పెరిగింది. జనాభాకు, పర్యావరణానికి మెట్రో రైలు ప్రయోజనాలు ఎంత మేరకు ఉన్నాయో.. అంతే స్థాయిలో డెవలపర్లకూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మియాపూర్‌- ఎల్బీనగర్‌ (కారిడార్‌-1), జేబీఎస్‌-ఫలక్‌నుమా (కారిడార్‌-2), నాగోల్‌-రాయదుర్గం/హైటెక్‌సిటీ (కారిడార్‌-3) ప్రాంతాలలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది.

2018 నుంచి 2021 మార్చి మధ్య కాలంలో ఆయా మెట్రో ప్రాంతాలలో ప్రాపర్టీల ధరలు 15-20 శాతం పెరిగాయని జేఎల్‌ఎల్‌ తెలిపింది. ఇతర ప్రాంతాలలోని వాణిజ్య స్థలాలతో పోలిస్తే కారిడార్‌-3 ప్రాంతాలలో ఏటా 20-25 శాతం, కారిడార్‌-1, 2 ప్రాంతాలలో 20 శాతం ధరలు వృద్ధి చెందుతున్నాయని జేఎల్‌ఎల్‌ వాల్యూవేషన్‌ అడ్వైజరీ హెడ్‌ శంకర్‌ తెలిపారు. గత ఐదేళ్లలో మెట్రో కారిడార్లలో 500 మీటర్ల లోపు భూమి విలువ 15-20 శాతం పెరిగింది. మెట్రో రైలు ప్రారంభం తర్వాత ఆయా ప్రాంతం, భూమి వినియోగం, మైక్రో మార్కెట్స్‌ సామర్థ్యాలన్ని బట్టి ఆస్తుల మార్కెట్‌ విలువలు 10-15 శాతం వరకు పెరిగాయి.

ఇతర ప్రాంతాలతో పోలిస్తే మెట్రో ప్రాంతాలలో ఏటా 2-5 శాతం ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రయాణ ఖర్చుల తగ్గింపు, ఉద్యోగ అవకాశాల కారణంగా రిటైల్, వాణిజ్య ధరలలో 20-25 శాతం మేర వృద్ధి నమోదయింది. రాబోయే మెట్రో కారిడార్లలో 500 మీటర్ల లోపు భూమి విలువ 10-15 శాతం వరకు పెరుగుతాయని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో 578.34 కి.మీ. వరకు మెట్రో రైల్‌ ఉంది. మరొక 760.62 కి.మీ. విస్తీర్ణంలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. కోచి, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, నాశిక్‌ నగరాల్లో కొత్త మెట్రో రైల్‌ లైన్లు నిర్మాణంలో ఉన్నాయి.

చదవండి: 

రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 1,000 కోట్ల పెట్టుబడులు

మరిన్ని వార్తలు