ఎంజీ చిన్న ఈవీ వస్తోంది

21 Apr, 2023 06:30 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా చిన్న ఎలక్ట్రిక్‌ కారు కామెట్‌ ఈవీ భారత్‌లో అడుగుపెడుతోంది. ఏప్రిల్‌ 26న కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. బుకింగ్స్‌ సైతం అదే రోజు మొదలు కానున్నాయి. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంటుంది. ఇండోనేషియాలో ఎంజీ విక్రయిస్తున్న వ్యూలింగ్‌ ఎయిర్‌ ఈవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించనుంది. రెండు డోర్లతో తయారైంది.

నలుగురు కూర్చునే వీలుంది. పొడవు సుమారు 3 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, ఎత్తు 1.63 మీటర్లు ఉంటుంది. 20 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, 2–స్పోక్‌ స్టీరింగ్‌ వీల్, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్, కీలెస్‌ ఎంట్రీ, వాయిస్‌ కమాండ్స్‌ వంటి హంగులు ఉన్నాయి. కామెట్‌ ఈవీని భారత్‌లో తయారు చేసేందుకు ఎంజీ కసరత్తు ప్రారంభించింది. బావొజున్‌ యెప్‌ ఎస్‌యూవీ 2025లో దేశీయ మార్కెట్లో రంగ ప్రవేశం చేయనుంది.

మరిన్ని వార్తలు