చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాన్ని లాంచ్‌ చేయనున్న ఎంజీ మోటార్స్‌..! ధర ఎంతంటే..?

12 Apr, 2022 07:27 IST|Sakshi

ఎంజీ మోటార్‌ రెండో ప్లాంట్‌ 

రూ.4,000 కోట్ల పెట్టుబడి 

రెండేళ్లలో తయారీ ప్రారంభం 

న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ మోటార్‌ భారత్‌లో రెండవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏడాదికి 1.75 లక్షల యూనిట్ల కార్లను తయారు చేసేసామర్థ్యంతో ఇది రానుంది. ఇందుకోసం రూ.4,000 కోట్ల దాకా వ్యయం చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. గుజ రాత్‌లో ఇప్పటికే సంస్థకు తయారీ కేంద్రం ఉంది. ఈ ఫెసిలిటీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70,000 యూనిట్లు. దీనిని వచ్చే ఏడాదికల్లా 1.25 లక్షల యూనిట్లకు చేర్చనున్నారు.

నూతన ప్లాంటు కోసం గుజరాత్‌ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్‌ ఛాబా తెలిపారు. ‘రెండేళ్లలో 3 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యం సొంతం చేసుకోవాలన్నది లక్ష్యం. ఇప్పటికే ఉన్న ప్లాంటును కొనుగోలు చేయాల్సిందిగా పలు సంస్థల నుంచి ఆఫర్‌ అందుకున్నాం. జూన్‌ చివరినాటికి నూతన ప్లాంటు విషయం కొలిక్కి వస్తుంది’ అని వివరించారు. 
 

ఏడాదిలో చిన్న ఈవీ.. 
రెండేళ్లలో కొత్త కేంద్రం సిద్ధం అవుతుందని రాజీవ్‌ వెల్లడించారు. ‘ఇందుకు కావాల్సిన మొత్తాన్ని పెట్టుబడి సంస్థలు, బాహ్య వాణిజ్య రుణాలు లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా సమకూర్చుకుంటాం. ఎఫ్‌డీఐ దరఖాస్తు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది’ అని వివరించారు. గుజరాత్‌ ప్లాంట్‌ సామర్థ్యం పెంచేందుకు రూ.2,500 కోట్లు వెచ్చిస్తున్నట్టు గతేడాది కంపెనీ ప్రకటించింది. 2021లో దేశవ్యాప్తంగా సంస్థ 40,000 వాహనాలను విక్రయించింది.

చిప్‌ కొరత ఉన్నప్పటికీ ఈ ఏడాది 70,000, వచ్చే ఏడాది 1.25 లక్షల యూనిట్ల కార్ల అమ్మకాలను నమోదు చేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఎంజీ మోటార్‌ చిన్న ఎలక్ట్రిక్‌ వాహనం 2023 మార్చి–ఏప్రిల్‌లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. ధర రూ.10–15 లక్షల మధ్య ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం దేశంలో హెక్టార్, గ్లోస్టర్, ఏస్టర్, జడ్‌ఎస్‌ ఈవీని విక్రయిస్తోంది.   

చదవండి: తగ్గేదేలే..! ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో టాటా మోటార్స్‌ దూకుడు..!

మరిన్ని వార్తలు