దేశీ స్మార్ట్‌ఫోన్ల రీఎంట్రీ...

31 Oct, 2020 08:03 IST|Sakshi

ఇప్పటికే ప్రకటించిన మైక్రోమ్యాక్స్‌ 

వరుసలో మరో మూడు కంపెనీలు

రూ.3–7 వేల ధరలోనూ మోడళ్లు

సాక్షి,హైదరాబాద్: దేశీయ స్మార్ట్‌ఫోన్ల రంగం మరోసారి వేడెక్కుతోంది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో సంచలనం సృష్టించిన భారతీయ బ్రాండ్లు చైనా కంపెనీల ధాటికి కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే మైక్రోమ్యాక్స్‌ తన ప్రణాళికను వెల్లడించింది. లావా, కార్బన్‌తోపాటు హైదరాబాద్‌ కంపెనీ సెల్‌కాన్‌ సైతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తిరిగి ప్రవేశించేందుకు ఉవ్విల్లూరుతోంది. అయితే లాక్‌డౌన్‌ తర్వాత మొబైల్స్‌ మార్కెట్‌ ఆగస్టు నుంచే పుంజుకుంది. పండుగల సీజన్‌ మొదలవడంతో అటు ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయాలు జోరు మీద ఉండడం దేశీయ బ్రాండ్లకు ఉత్సాహాన్ని ఇస్తోంది. 

మారుతున్న మార్కెట్‌.. 
దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకున్నాయి. క్వాడ్‌ కెమెరాలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్, అధిక ర్యామ్, ఇన్‌బిల్ట్‌ మెమరీ ఉన్న మోడళ్లను కస్టమర్లు కోరుతున్నారు. ఫీచర్‌ ఫోన్‌ నుంచి అప్‌గ్రేడ్‌ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు భారతీయ బ్రాండ్లు ఎలాంటి ఫీచర్లను తీసుకొస్తాయన్నదే ఆసక్తిగా మారింది. 2011–12 ప్రాంతంలో భారత్‌లో 160కిపైగా బ్రాండ్లు మొబైల్స్‌ రంగంలో పోటీపడ్డాయి. శామ్‌సంగ్, సోనీ, నోకియా, ఎల్‌జీ, మోటరోలా, ప్యానాసోనిక్‌ వంటి బ్రాండ్ల హవా నడుస్తున్న కాలంలో ఒక్కసారిగా దేశీయ బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇక్కడి బ్రాండ్ల ధాటికి శామ్‌సంగ్‌ మినహా మిగిలినవి కనుమరుగయ్యాయి. అయితే 2014 నుంచి చైనా బ్రాండ్లు క్రమంగా తమ వాటాను పెంచుకుంటూ వస్తున్నాయి. దీంతో దేశీయ బ్రాండ్లు పోటీ నుంచి తప్పుకున్నాయి. తాజాగా ఈ కంపెనీలు తిరిగి పోటీకి సై అంటున్నాయి. (చదవండి: మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్)

తక్కువ ధరల్లో..
దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌.. భారతీయ బ్రాండ్లకు పునాదిగా నిలవనుంది. దేశీయ కంపెనీలు రూ.15,000లోపు ధరలో ఉండే ఫోన్లను భారత్‌తోపాటు విదేశాల్లో విక్రయించినా ప్రభుత్వం 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. విదేశీ కంపెనీలకైతే ఇది రూ.15,000 పైన ధరగల మోడళ్లకు వర్తింపజేస్తున్నట్టు మార్కెట్‌ వర్గాలు సమాచారం. దేశీయ బ్రాండ్లు గతంలో ఎగుమతులను విజయవంతంగా చేశాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల అండతో తిరిగి విదేశీ మార్కెట్లకూ ఈ కంపెనీలు విస్తరించే అవకాశం లేకపోలేదు. భారతీయ బ్రాండ్లు రూ.3–7 వేల ధరల శ్రేణిలో సైతం స్మార్ట్‌ఫోన్లను ఆఫర్‌ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. గతంలో మాదిరిగా ఇబ్బడిముబ్బడిగా కాకుండా పరిమిత మోడళ్లతోనే రంగ ప్రవేశం చేయనున్నాయి. మైక్రోమ్యాక్స్‌ తన ‘ఇన్‌’ బ్రాండ్‌లో రూ.7–20 వేల శ్రేణిలో పోటీపడతామని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి తాము తిరిగి ప్రవేశిస్తున్నట్టు సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ధ్రువీకరించారు.(వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్)

అత్యధిక అమ్మకాలు.. 
దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో 5 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడై జీవితకాల గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఈ మొత్తం అమ్మకాల్లో 76 శాతం వాటా చైనా కంపెనీలదేనని పరిశోధన సంస్థ కెనాలిస్‌ వెల్లడించింది. షావొమీ 26.1 శాతం, శామ్‌సంగ్‌ 20.4, వివో 17.6, రియల్‌మీ 17.4, ఒప్పో 12.1 శాతం మార్కెట్‌ వాటాను చేజిక్కించుకున్నాయి. చైనా కంపెనీలకు పోటీగా అమెజాన్‌తో కలిసి శాంసంగ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బెస్ట్‌ ప్రైస్‌లో ఎక్కువ ఫీచర్లతో ‘ఎం’ సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చి విజయవంతం అయింది. షావొమీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సత్తా చాటుతోంది. వివో, ఒప్పో ఆఫ్‌లైన్‌లో చొచ్చుకుపోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ఆసరాగా రియల్‌మీ సక్సెస్‌ అయింది. ఇప్పుడు దేశీయ బ్రాండ్లు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనున్నాయో వేచి చూడాలి. కొత్త బ్రాండ్లకూ భారత్‌లో మార్కెట్‌ ఉందని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. అధిక ఫీచర్లతో తక్కువ ధరలో మోడళ్లను అందించగలిగితే సక్సెస్‌ ఖాయమన్నారు.

మరిన్ని వార్తలు