యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ జోరు- నాస్‌డాక్‌ రికార్డ్

4 Aug, 2020 10:00 IST|Sakshi

టిక్‌టాక్‌పై కన్ను- మైక్రోసాఫ్ట్‌ 5 శాతం ప్లస్‌

షేర్ల విభజన- 2.5 శాతం ఎగసిన యాపిల్ ఇంక్‌ 

కోవిడ్‌-19 ఔషధం మూడో దశ పరీక్షలు- ఎలీ లిల్లీ అప్‌

ఏడాదిన్నర తదుపరి జులైలో తయారీ రంగం జోష్‌

ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ అండగా నిలవడంతో సోమవారం నాస్‌డాక్‌ తిరిగి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. దీనికితోడు జులైలో తయారీ రంగం ఏడాదిన్నర తదుపరి జోరందుకున్నట్లు వెలువడిన గణాంకాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి సోమవారం డోజోన్స్‌ 236 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 26,664కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 24 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,295 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 158 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 10,903 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంతక్రితం జులై 20న సాధించిన రికార్డ్‌ గరిష్టాన్ని అధిగమించింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టాలను సాధించేందుకు ఎస్‌అండ్‌పీ 2.9 శాతం దూరంలో నిలవగా.. డోజోన్స్‌ దాదాపు 10 శాతం ర్యాలీ చేయవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు.  

జులైలో జూమ్‌
జులైలో డోజోన్స్‌ 2.4 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ 5.5 శాతం ఎగసింది. ఇక నాస్‌డాక్‌ మరింత స్పీడుతో దాదాపు 7 శాతం జంప్‌చేసింది. గత వారం రోజుల్లోనే నాస్‌డాక్‌ 4.5 శాతం బలపడటం విశేషం!

నెట్‌ఫ్లిక్స్‌ అప్‌
చైనీస్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇంక్‌ జోరందుకుంది. 5.6 శాతం జంప్‌చేసింది. టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని సొంతం చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది. కాగా.. మరోపక్క షేర్ల విభజన ప్రకటించిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ సైతం 2.5 శాతం ఎగసింది. ఈ బాటలో ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ 2 శాతం పుంజుకుంది. కోవిడ్‌-19 చికిత్సకు రూపొందిస్తున్న ఔషధం మూడోదశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఎలీ లిల్లీ 1.7 శాతం బలపడింది. 

కొనుగోళ్లు
గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌.. 7 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో హోమ్‌ సెక్యూరిటీ కంపెనీ ఏడీటీ 56 శాతం దూసుకెళ్లింది. ఇందుకు అల్ఫాబెట్‌ 45 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా జర్మన్‌ దిగ్గజం సీమెన్స్‌ హెల్దినీర్స్‌ టేకోవర్‌ చేయనున్న వార్తలతో వారియన్‌ మెడికల్‌ సిస్టమ్స్‌ 22 శాతం జంప్‌చేసింది. ఇందుకు సీమెన్స్‌ 16 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.  

ఆసియా లాభాల్లో
సోమవారం యూరోపియన్‌ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా 0.25 శాతం నీరసించగా.. మిగిలిన మార్కెట్లు 1.5-0.5 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు