భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ సీక్రెట్‌ టెస్టింగ్‌! కోడ్‌నేమ్‌ ఏంటో తెలుసా?

26 Feb, 2023 16:30 IST|Sakshi

సాంకేతిక ప్రపంచంలో చాట్‌జీపీటీ ఇప్పుడు ఓ సంచలనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్ జీపీటీని యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్.. తన సెర్చ్‌ ఇంజన్ బింగ్ లోనూ చాట్ జీపీటీ తరహా సేవలు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

అయితే మైక్రోసాఫ్ట్‌ తన బింగ్‌ ఏఐ చాట్‌బాట్‌ ‘సిడ్నీ’ని కొన్నేళ్లుగా భారత్‌లో సీక్రెట్‌ టెస్టింగ్‌ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఫోరమ్‌లలో పాత యూజర్ పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. ఇలా రహస్యంగా పరీక్షించి, సామర్థ్యాలను మెరుగుపరిచి తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్‌ సెర్చ్‌ఇంజన్‌ అయిన బింగ్‌ యూజర్లకు సమాచారం అందించడంలో సహాయకంగా సిడ్నీ చాట్‌బాట్‌ను రూపొందించారు. సాధారణ భాషలో యూజర్లు ఇచ్చే కమాండ్లను ఇది అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సమాచారం అందిస్తుంది. ఈ చాట్‌బాట్‌ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్‌కు భారత్‌ కీలకమైన టెస్టింగ్‌ గ్రౌండ్‌గా ఉపయోగపడింది.

(ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!)

మైక్రోసాఫ్ట్‌ చాట్‌బాట్‌ ఫీచర్‌ ‘సిడ్నీ’ అనేది పాత కోడ్‌నేమ్‌ అని, దీన్ని తాము 2020 నుంచి భారత్‌తో పరీక్షిస్తున్నామని మైక్రోసాఫ్ట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ కైట్లిన్‌ రౌల్స్‌టన్‌ ‘వెర్జ్‌’ అనే సంస్థకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియలో చాలా మంది నిపుణులు తమకు సహాయపడ్డారని, ఇలాగే సరికొత్త టెక్నిక్‌లతో యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ రంగలో మైక్రోసాఫ్ట​్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో చాట్‌బాట్‌ల రూపకల్పన కీలక అభివృద్ధి. ఈ చాట్‌బాట్‌లు ప్రస్తుతం యూజర్లకు అవసరమైన సమాచారాన్ని, సహాయాన్ని క్షణాల్లో అందిస్తూ చాలా ప్రాచుర్యం పొందాయి. మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ ఏఐ చాట్‌బాట్‌ను సెర్చ్‌ఇంజన్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించినా ప్రస్తుతం స్కైప్‌ వంటి తమ ఇతర సేవలకూ దీన్ని అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్‌!)

మరిన్ని వార్తలు