‘ఓయో’లో వాటాలపై మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి

31 Jul, 2021 00:11 IST|Sakshi

చర్చల దశలో ప్రతిపాదనలు 

సంస్థ విలువ రూ.67,000 కోట్లు 

న్యూఢిల్లీ: ఆతిథ్య సేవల్లోని భారత్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఓయో’లో వాటాలు కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపిస్తోందని సమాచారం. 9 బిలియన్‌ డాలర్ల విలువ ఆధారంగా (రూ.67,000 కోట్లు) వాటాల కొనుగోలుపై చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు ఒప్పంద పరిమాణం గురించి వివరాలను బయటపెట్టలేదు. ఓయో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కు రావడానికి ముందుగానే మైక్రోసాఫ్ట్‌ వాటాలను కొనుగోలు చేయడం పూర్తవుతుందని పేర్కొన్నాయి.

ఈ విషయమై మైక్రోసాఫ్ట్, ఓయో అధికారికంగా స్పందించలేదు. ఓయో ఈ నెల మొదట్లోనే 660 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,920 కోట్లు) నిధులను టర్మ్‌ లోన్‌ బి (టీఎల్‌బీ/రుణం) రూపంలో అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. దీనికి ఇన్‌స్టిట్యూషన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. బిలియన్‌ డాలర్ల వరకు రుణాలను సమకూర్చేందుకు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఓయోలో ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్, విజన్‌ ఫండ్, సీక్వోయా క్యాపిటల్, లైట్‌స్పీడ్‌ వెంచర్స్, హీరో ఎంటర్‌ప్రైజ్‌ తదితర సంస్థలకు వాటాలున్నాయి.

మరిన్ని వార్తలు