Microsoft: మైక్రోసాఫ్ట్‌ చేతికి యాక్టివిజన్‌ 

19 Jan, 2022 01:51 IST|Sakshi

డీల్‌ విలువ 69 బిలియన్‌ డాలర్లు 

కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు 

ప్రఖ్యాత క్యాండీ క్రష్, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ తదితర గేమ్స్‌ కంపెనీ 

న్యూయార్క్‌: గ్లోబల్‌ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తాజాగా గేమింగ్‌ దిగ్గజం యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 69 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 5.15 లక్షల కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ద్వారా మొబైల్, పీసీ, కన్సోల్, క్లౌడ్‌ విభాగాల్లో గేమింగ్‌ బిజినెస్‌ను మరింత విస్తరించుకునే వీలుంది. డీల్‌ను క్యాండీ క్రష్, వరల్డ్‌ ఆఫ్‌ వార్‌క్రాఫ్ట్‌ తదితర పలు సుప్రసిద్ధ గేములను రూపొందించిన కంపెనీ కొనుగోలులో భాగంగా షేరుకి 95 డాలర్ల చొప్పున ధరను చెల్లించనుంది.

వారాంతాన ముగింపు ధరతో పోలిస్తే ఇది 45 శాతం ప్రీమియం. డీల్‌ పూర్తయ్యేవరకూ యాక్టివిజన్‌ ప్రస్తుత సీఈవో బాబీ కొటిక్‌ ఆ పదవిలో కొనసాగనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. తదుపరి మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ హెడ్‌ ఫిల్‌ స్పెన్సర్‌ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మహిళా ఉద్యోగులపై వేధింపుల సంబంధిత కేసుల నేపథ్యంలో ఇటీవల యాక్టివిజన్‌ షేరు డీలా పడినట్లు పరిశ్రమ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. యాక్టివిజన్‌ కొనుగోలుతో ఎక్స్‌బాస్‌ కన్సోల్‌ ఆఫరింగ్స్‌ను మైక్రోసాఫ్ట్‌ మరింత విస్తరించనుంది. తద్వారా సోనీ కార్ప్‌ ప్లేస్టేషన్‌తో మరింత సమర్థంగా పోటీ పడే అవకాశమున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు