మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ శకం ముగిసినట్టే!

21 Aug, 2020 14:15 IST|Sakshi

నిలిచిపోనున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్  అందుబాటులోకి

సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కు చెందిన ప్రతిష్టాత్మక వెబ్‌ బ్రౌజర్‌ "ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌" సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్ ఇక కనుమరుగు కానుంది. వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను‌ నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా వెల్లడించింది.  

2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని  ఈ ఏడాది నవంబర్‌ 30 తర్వాత నుంచి తమ టీమ్‌ కూడా అందుబాటులో ఉండదని ఇటీవల వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌ సేవలు భవిష్యత్తులో దీనిని సపోర్ట్‌ చేయవని పేర్కొంది.  అలాగే మార్చి 9, 2021 తరువాతనుంచి ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది.  దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటుందనితెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ మాదిరిగానే ఉండే కొత్త బ్రౌజర్‌ వేగంగా, సమర్ధవంతంగా పనిచేస్తుంది. జనవరిలో ఇది లాంచ్ అయినప్పటినుంచి లక్షలాది మంది యూజర్లు తమ బ్రౌజర్‌లను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నారు.  కాగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ 25 ఏళ్ల క్రితం, ఆగస్టు,1995లో విడుదలైంది. 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గా నిలిచింది. అయితే ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఈ పోటీలో దూసుకు రావడంతో క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది.

మరిన్ని వార్తలు