మరో పిడుగు : భారీగా పెరగనున్న పాల ధర

26 Feb, 2021 11:24 IST|Sakshi

లీటరు పాలపై రూ.12  పెంపు

మార్చి 1 నుంచి   అమలు

అటు పెట్రో సెగలు, ఇటు కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి 

సాక్షి, భోపాల్‌ : ఒకవైపు  ఆకాశాన్నంటుతున్న పెట్రోలు ధరలు, మరోవైపు  వంటగ్యాస్‌ ధర పెంపు సగటు భారతీయుడి నెత్తిన పెనుభారాన్నిమోపుతున్నాయి. పెట్రో ధరల సెగ నిత్యావసరాలు, రవాణా, ఇతర రంగాలపై పడుతుందన్న ఆందోళన నేపథ్యంలో మరో బాంబు ప్రజల నెత్తిన పడనుంది. ఇప్పటికే భారీ పెరిగిన ఉల్లి ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.. తాజాగా పాల ధర కూడా భగ్గుమనేందుకు సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దేశంలో కూడా  ధర భారీగా పెరగనుందన్న  ఆందోళన వినియోగదారులను మరింత  బెంబేలెత్తిస్తోంది.  (పెట్రో సెగలపై ఆర్‌బీఐ సంచలన వ్యాఖ్యలు)

డీఎన్‌ఏ సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 25 గ్రామాలకు చెందిన కూరగాయలు, పాల ఉత్పత్తిదారు సంఘాలు  నిర్ణయించాయి. ఈ నెల 23న నిర్వహించిన  సమావేశంలో లీటరుపై రూ.12 పెంచేందుకు నిర్ణయించారు. సంబంధిత అధికారుల అనుమతి అనంతరం మార్చి 1 నుంచి ధర పెంపును అమలు చేయనున్నారు.  ఈ ధర అమల్లోకి వస్తే, లీటరు పాల ధర రూ .55 పలకనుంది. అంటే  ప్రస్తుత లీటర్ పాల ధర రూ.43పై అదనంగా మరో రూ.12 చెల్లించాల్సి ఉంటుందన్న మాట.  గత ఏడాదిలోనే పాల ధరల పెంపుపై ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు. కానీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది.  మహమ్మారి కారణంగా పాల ధరల పెంపు వాయిదా పడిందని ఇపుడిక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్థానిక పాల ఉత్పత్తిదారుల అసోసియేషన్ అధ్యక్షుడు హిరలాల్ చౌదరి వెల్లడించారు. 


 

మరిన్ని వార్తలు