సిరి ధాన్యాల భారీ ఎగుమతులపై కేంద్రం దృష్టి

18 Nov, 2022 15:14 IST|Sakshi

గ్లోబల్‌ రిటైల్‌ సూపర్‌ మార్కెట్లతో అనుసంధాన చర్యలు

దేశ, విదేశాల్లో దౌత్యవేత్తల సహకారానికి ప్రయత్నాలు

2023ను ప్రపంచ మిల్లెట్స్‌   సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యం   

న్యూఢిల్లీ: దేశం నుంచి భారీ ఎత్తున కొర్రలు,  సామలు, అరికల వంటి సిరి (చిరు/తృణ) ధాన్యాల ఎగుమతులపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకు తగిన వ్యూహ రచన చేసింది. ఎగుమతుల పురోగతికి క్యారీఫోర్, వాల్‌మార్ట్‌ వంటి గ్లోబల్‌ రిటైల్‌ సూపర్‌మార్కెట్లతో అనుసంధాన చర్యలతో పాటు, దేశ, అంతర్జాతీయ దౌత్య కార్యాలనూ వినియోగించుకునే ప్రయత్నాలు చేయాలన్నది ఈ వ్యూహ రచన ప్రధాన ఉద్దేశం. దేశీయ ఎగుమతుల బ్రాండింగ్, ప్రచారం వంటి అంశాలకు సంబంధించి తాజా వ్యూహం మంచి ఫలితాలను ఇస్తాయని కేంద్రం భావిస్తోందని ఒక ప్రకటన పేర్కొంది. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ (యూఎన్‌జీఏ) ప్రకటించడం దీనికి నేపథ్యం.

దీనికి సంబంధించి వెలువడిన వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన ప్రకారం... 
♦ బిజినెస్‌-టు-బిజినెస్‌ (బీ2బీ) సమావేశాలను నిర్వహించడానికి, భారతీయ మిల్లెట్‌ల కోసం నేరుగా అవగాహనలు కుదుర్చుకోడానికి,  డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లు, సూపర్‌ మార్కెట్‌ హైపర్‌మార్కెట్‌ల వంటి పటిష్ట కొనుగోలుదారులను గుర్తించడానికి దేశ, అంతర్జాతీయ రాయబార కార్యాలయాల సహకారాన్ని భారత్‌ తీసుకుంటుంది.  
♦ బ్రాండ్‌ ప్రమోషన్‌ వ్యూహం ప్రకారం, లులు గ్రూప్, క్యారీఫోర్, అల్‌ జజీరా, అల్‌ మాయా, వాల్‌మార్ట్‌ వంటి ప్రధాన అంతర్జాతీయ రిటైల్‌ సూపర్‌ మార్కెట్‌లు మిల్లెట్‌ల బ్రాండింగ్, అలాగే ప్రమోషన్‌ కోసం ‘మిల్లెట్‌ కార్నర్‌’లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
♦ ఎగుమతిదారులు, రైతులు, వ్యాపారులు పాల్గొనేలా 16 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారుల-విక్రయదారుల సమావేశాల ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.  
♦  గల్‌ఫుడ్‌ 2023, సియోల్‌ ఫుడ్‌ అండ్‌ హోటల్‌ షో, సౌదీ ఆగ్రో ఫుడ్, సిడ్నీలో ఫైన్‌ ఫుడ్‌ షో, బెల్జియం ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ షో వంటి వివిధ గ్లోబల్‌ ప్లాట్‌ఫారమ్‌లలో మిల్లెట్‌లు దాని విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించడానికి ప్రణాళికల రూపకల్పన జరుగుతోంది.  
♦ నూడుల్స్, పాస్తా, అల్పాహారం తృణధాన్యాలు మిక్స్, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, స్వీట్లు వంటి రెడీ-టు-ఈట్‌ అలాగే రెడీ-టు-సర్వ్‌ విభాగంలో విలువ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం స్టార్టప్‌లను సమీకరించనుంది.  
ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) హైదరాబాద్, ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రి షన్, హైదరాబాద్, సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్సి్టట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) మైసూర్, ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌తో కలిసి అంతర్జాతీయ మార్కెట్‌లో మినుములు అలాగే విలువ ఆధారిత మిల్లెట్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను కేంద్రం రూపొందిస్తోంది.  
♦ ఎగుమతులకు ఊతం ఇవ్వడానికి,  పోషకాహార తృణధాన్యాల సరఫరా గొలుసులోని (సప్లై చైన్‌) అడ్డంకులను తొలగించడానికి న్యూట్రి తృణధాన్యాల ఎగుమతిల ప్రోత్సాహక వేదిక (ఎన్‌సీఈపీఎఫ్‌) ఏర్పాటు జరిగింది.  

గ్లోబల్‌ మార్కెట్‌లో భారత్‌ హవా.. 
మిల్లెట్లలో కాల్షియం, ఐరన్‌ ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. గడచిన ఆర్థిక సంవత్సరం (2021-22) భారతదేశం 34.32 మిలియన్‌ డాలర్ల విలువైన మిల్లెట్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఎగుమతులు పరిమాణం పరంగా, 2020-21లో 1,47,501.08 టన్నుల నుండి  2021-22లో 8 శాతం పెరిగి 1,59,332.16 టన్నులకు చేరుకుంది. ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 41 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోని మిల్లెట్ల ఉత్పత్తిదేశాల్లో అగ్రగామిగా ఉంది. ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ప్రకారం, 2020లో ప్రపంచ మిల్లెట్ల ఉత్పత్తి 30.464 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంఎంటీ). ఇందులో భారతదేశం వాటా 12.49 ఎంఎంటీలు.

భారతదేశం 2020-21తో పోల్చి 2021-22లో మిల్లెట్‌ ఉత్పత్తిలో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశంలో 15.92 ఎంఎంటీ ఉత్పత్తి జరిగింది. భారత్‌లో మొదటి ఐదు మిల్లెట్‌ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. దేశ మిల్లెట్‌ ఎగుమతి వాటా మొత్తం మిల్లెట్‌ ఉత్పత్తిలో ఒక శాతం. భారతదేశం నుండి మిల్లెట్ల ఎగుమతులు ప్రధానంగా ధాన్యంగా ఉంటాయి. అలాగే భారతదేశం నుండి మిల్లెట్ల విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి చాలా తక్కువ. అయితే,  ప్రస్తుత  ప్రపంచ 9 బిలియన్‌ డాలర్ల మిల్లెట్‌ మార్కెట్‌ విలువ, 2025 నాటికి 12 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

భారత్‌ ప్రధాన మిల్లెట్‌ ఎగుమతి దేశాల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏ ఈ), నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, బ్రిటన్, అమెరికాలు ఉన్నాయి.  ప్రపంచంలోని ప్రధాన మిల్లెట్‌ దిగుమతి దేశాల్లో ఇండోనేషియా, బెల్జియం, జపాన్, జర్మనీ, మెక్సికో, ఇటలీ, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. భారత్‌ ఎగుమతి చేసే మిల్లెట్‌లలో సజ్జలు, రాగి, కానరీ, జొన్నలు,  బుక్‌వీట్‌లు (గోధుమ రకం) ఉన్నాయి. ఉత్పత్తిచేసి, ఎగుమతయ్యే మిల్లెట్లలో ప్రధానంగా 16 రకాలు ఉన్నాయి. వీటిలో జొన్న (జోవర్‌), పెరల్‌ మిల్లెట్‌ (బజ్రా), ఫింగర్‌ మిల్లెట్‌ (రాగి) మైనర్‌ మిల్లెట్‌ (కంగాణి), ప్రోసో మిల్లెట్‌ (చీనా), కోడో మిల్లెట్‌ (కోడో), బారాన్యర్డ్‌ మిల్లెట్‌ (సావా/సన్వా/ఝంగోరా), లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి) ఉన్నాయి. 

మరిన్ని వార్తలు