బలమైన వృద్ధి బాటలో పయనిస్తున్న మైనింగ్‌

8 Jun, 2023 08:09 IST|Sakshi

కర్బన ఉద్గారాల తగ్గింపునకు ప్రాధాన్యం

మైనింగ్‌పై కేపీఎంజీ నివేదిక

న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్స్‌ పరిశ్రమ ఈ ఏడాది కూడా బలమైన వృద్ధి బాటలో పయనిస్తుందని, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల దిశగా పురోగతి సాధిస్తుందని (నెట్‌ జీరో/ఈఎస్‌జీ అనుకూల) కేపీఎంజీ ఇంటర్నేషనల్‌ ‘2023 గ్లోబల్‌ మైనింగ్‌ అండ్‌ మెటల్స్‌ అవుట్‌లుక్‌’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మెటల్స్‌ రంగం టెక్నాలజీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నట్టు కేపీఎంజీ ఇంటర్నేషన్‌ మెటల్స్‌ హెడ్‌ ఉగో ప్లటానియా పేర్కొన్నారు.  

  • పరిశ్రమకు చెందిన ప్రతి ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో నలుగురు ఉత్పాదకత వృద్ధి, సుస్థిర లక్ష్యాల విషయంలో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒకరు మాత్రం నిరాశావహంగా ఉన్నారు. 
  • అల్యూమినియం, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, లిథియం, మాంగనీస్, నికెల్‌ ఉత్పత్తిదారుల్లో సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అంతరం కనిపించింది. వేగంగా ఈ మార్గాన్ని చేరుకుంటామని 64 శాతం మందే చెప్పారు.   
  • తమ కంపెనీ ఇప్పుడే ఈ దిశగా అడుగులు వే­యడం మొదలు పెట్టినట్టు 34 శాతం మంది చెప్పారు.  
  •  కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం ఖర్చుతో కూడుకున్నది కాకుండా లాభాలకు మార్గమని మెజారిటీ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్తు పట్ల ఆశావహంగా ఉన్నారు.  
  • మైనింగ్‌లో వేగంగా పురోగతి సాధిస్తున్న కంపెనీలు ఇప్పటికే కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా చర్యలు అమలు చేస్తున్నాయి. ఈ దిశగా వస్తున్న సానుకూల ఫలితాలు వాటితో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి.  
  • ముఖ్యంగా కంపెనీ సీఈవోలు,బోర్డు డైరెక్టర్లు ఈఎస్‌జీ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉన్నారు.
మరిన్ని వార్తలు