అందుబాటు గృహాలు కట్టండి

14 Aug, 2021 02:19 IST|Sakshi

నిర్మాణ రాయితీలపై సీఎంతో మాట్లాడతా

రెరాకు శాశ్వత చైర్మన్, అథారిటీ ఏర్పాటు

క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో మంత్రి వేముల

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు బాగున్నాయి కాబట్టి పెద్ద సైజు గృహాలు, లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలు బాగానే సాగుతున్నాయని.. ఇది ఎల్లకాలం ఉండదని గృహ విక్రయాలలో స్థిరత్వం ఉండాలంటే మధ్యతరగతి గృహాలను నిర్మించాలని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అవసరమైన భూముల కొనుగోళ్లు, అనుమతుల మంజూరు, నిర్మాణ రాయితీలు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావులతో చర్చిస్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

గచ్చిబౌలిలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో శుక్రవారం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వెలుపల 20–30 కి.మీ. దూరంలో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ కోసం సుమారు రూ.3 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. ఇందులో రూ.1,500 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అందుబాటులోకి వస్తే రియల్టీ పరిశ్రమ 20–30 ఏళ్లు ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కువ స్థలం అందుబాటులోకి వచ్చి చౌక ధరలలో స్థలాలు దొరుకుతాయని పేర్కొన్నారు.

రెరాకు శాశ్వత చైర్మన్‌..
త్వరలోనే తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు శాశ్వత చైర్మన్, పూర్తి స్థాయి అధికారులను నియమించడంతో పాటు రిటైర్డ్‌ జడ్జి లేదా పరిశ్రమలోని నిపుణులను అథారిటీగా నియమించే అంశం తుదిదశకు చేరుకుందని మంత్రి వివరించారు. ధరణిలో అర్బన్‌ ఏరియాలతో ముడిపడి ఉన్న వ్యవసాయ భూములలో కొన్ని మినహా.. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు లేవని దీంతో ఆయా స్థలాల క్రయవిక్రయాల సమయంలో 15–20 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్, బ్యాండ్‌విడ్త్‌ రిలేటెడ్‌ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ధరణిలో నమోదైన భూములకు చట్టబద్ధత వస్తుందని.. దీంతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు, లావాదేవీలకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటు నుంచి పని చేసుకునే విధంగా సులభతరంగా ధరణిని రూపొందించామని చెప్పారు.

ధరణిలో లీగల్‌ ప్రొవిజన్స్‌ లేవు..
ఇప్పటికీ ధరణిలో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని... ప్రధానంగా న్యాయమపరమైన నిబంధనలు (లీగల్‌ ప్రొవిజన్స్‌) లేవని తెలంగాణ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతో భూ యజమానులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)లతో కలిపి మరొక సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. ధరణి విధానాన్ని ముందుగా ఒకట్రెండు జిల్లాలలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టి వాటి ఫలితాలను అంచనా వేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ పీ రామకృష్ణారావు సూచించారు. ప్రతి 10 ప్రాపర్టీలలో 7 ధరణి సమస్యలలో చిక్కుకున్నాయన్నారు. వేలాది దరఖాస్తుల కరెక్షన్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించే సమయం కలెక్టర్లకు ఉండటం లేదని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 5–6 నెలల సమయం పడుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పెషల్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లను నియమిస్తే పది రోజుల్లో పరిష్కరించవచ్చని చెప్పారు.

టీఎస్‌–బీపాస్‌ పర్మిషన్స్‌ సంపూర్ణంగా లేవు..
టీఎస్‌–బీపాస్‌తో 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు వస్తున్నప్పటికీ అవి సంపూర్ణంగా లేవని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ, ఎన్విరాన్‌మెంటల్, వాటర్‌ బోర్డ్‌ విభాగాలు టీఎస్‌–బీపాస్‌లో అనుబంధమై లేవని.. దీంతో ఆయా విభాగాల కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో లేదా అర్బన్‌ ఏరియా ప్రాంతాలలో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (కార్డ్‌) విధానాన్నే ఉంచాలని కోరారు. గ్రిడ్, వేర్‌హౌస్‌ పాలసీలు, ఈ–సిటీ, ఎంఎస్‌ఎంఈ, మెడికల్‌ డివైజ్‌ వంటి పార్క్‌లు, ఫార్మా సిటీ వంటి కొత్త కొత్త అభివృద్ధి పనులు జరుగుతున్నాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ వీ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. దీంతో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం నలువైపులా విస్తరిస్తుందని తెలిపారు. పాలసీల రూపకల్పనలో రియల్టీ నిపుణులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.

నేడు, రేపు కూడా ప్రాపర్టీ షో
క్రెడాయ్‌ హైదరాబాద్‌ 10వ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు వంద స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 15 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. శని, ఆదివారాలలో కూడా ప్రాపర్టీ షో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ వంటి బ్యాంక్‌లు, పలు నిర్మాణ సామగ్రి సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మూడు రోజుల్లో కలిపి సుమారు 60 వేల మంది సందర్శకులు వస్తారని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీ ఆనంద్‌ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్‌ జైదీప్‌ రెడ్డి, బీ జగన్నాథ్‌ రావు, ట్రెజరర్‌ ఆదిత్య గౌరా, జాయింట్‌ సెక్రటరీలు శివరాజ్‌ ఠాకూర్, కే రాంబాబు, క్రెడాయ్‌ నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు