ఎంఅండ్‌ఎం లాభం హైజంప్‌

10 Nov, 2021 04:07 IST|Sakshi

క్యూ2లో రూ. 1,929 కోట్లు 

ఆదాయం 15 శాతం అప్‌ 

ట్రాక్టర్ల విక్రయాలపై బేస్‌ ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో మూడు రెట్లు ఎగసి రూ. 1,929 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 615 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 19,227 కోట్ల నుంచి రూ. 21,470 కోట్లకు జంప్‌ చేసింది.

ఇక స్టాండెలోన్‌ నికర లాభం మరింత అధికంగా 8 రెట్లు ఎగసి రూ. 1,432 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో కేవలం రూ. 162 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 15 శాతం పుంజుకుని రూ. 13,305 కోట్లయ్యింది. వాహన విక్రయాలు 9% పెరిగి 99,334 యూనిట్లను తాకాయి. అయితే ట్రాక్టర్ల విక్రయాలు 5% క్షీణించి 88,920 యూనిట్లకు పరిమితమయ్యాయి.  

మెరుగుపడే చాన్స్‌: 2022లోనూ సరఫరా సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నట్లు ఎంఅండ్‌ఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ జేజురికర్‌ పేర్కొన్నారు. అయితే 2021లో తలెత్తిన స్థాయిలో సవాళ్లకు అవకాశంలేదని భావిస్తున్నట్లు తెలియజేశారు. గత క్యూ2లో అధికస్థాయిలో ట్రాక్టర్ల విక్రయాలు నమోదుకావడం(బేస్‌ ఎఫెక్ట్‌)తో తాజా సమీక్షా కాలంలో గణాంకాలు మందగించినట్లు వెల్లడించారు.

కాగా.. ఎక్స్‌యూవీ700 వాహనానికి భారీ డిమాండ్‌ నెలకొన్నట్లు ఎంఅండ్‌ఎం పేర్కొంది. 70,000 వాహనాలకుపైగా బుకింగ్స్‌ నమోదైనట్లు తెలియజేసింది. మేరు ట్రావెల్‌ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను మహీంద్రా లాజిస్టిక్స్‌కు విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు బీఎస్‌ఈలో 4% జంప్‌చేసి రూ. 893 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు