అన్నీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లు ఒకే యాప్‌లో

9 Sep, 2021 17:55 IST|Sakshi

దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయల దాటేసరికి వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కొత్త వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పన అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలా, టీవీఎస్‌, అథెర్స్‌ లాంటి చాలా కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రతి ఎలక్ట్రిక్ వాహన కంపెనీ తమ వాహన దారుల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌తో వస్తున్నాయి. 

ఈ యాప్ ద్వారా వాహన దారులు తమ వాహనాల ఛార్జింగ్ కోసం తమ దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను చూడవచ్చు. అయితే, ఆ యాప్‌లో ఆ వాహన కంపెనీకి చెందిన ఛార్జింగ్ స్టేషన్లను మాత్రమే చూసే అవకాశం ఉంది. కానీ, తమ దగ్గరలో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లను చూసే అవకాశం లేదు. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ "ఈవి ప్లగ్స్(EV Plugs)" అనే ఒక కొత్త మొబైల్ యాప్ మార్కెట్లోకి వచ్చింది. ఈ యాప్ ఇతర కంపెనీల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను చూపిస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ లభ్యం అవుతోంది. (చదవండి: ఖాతాదారులకు అలర్ట్.. ఇక ఈ బ్యాంకు చెక్‌బుక్‌లు పనిచేయవు)

ఢిల్లీకి చెందిన మనీష్ నారంగ్, కపిల్ నారంగ్, అశ్వనీ అరోరా కలిసి 2021లో "ఈవీ ప్లగ్స్" అనే ఈ యాప్‌ను స్థాపించారు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత, మీరు చేయాల్సిందల్లా దానికి జీపీఎస్ యాక్సెస్ ఇవ్వడమే. దీని తర్వాత, మీరు ఏ కంపెనీకి చెందిన ఈవీ ఛార్జర్ కోసం చూస్తున్నారని యాప్ మిమ్మల్ని అడుగుతుంది(కారు లేదా బైక్). మీరు ప్రముఖ బ్రాండ్ కు చెందిన వాహనాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యాప్ మీ సమీపంలోని అన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఈవి ఛార్జింగ్ స్టేషన్ రకాలను చూపిస్తుంది. అంతేగాక, మీరు స్టేషన్ పూర్తి వివరాలను కూడా చూడవచ్చు. 

మరిన్ని వార్తలు