జోరు మీదున్న మొబైల్‌ గేమింగ్‌

20 Mar, 2021 00:09 IST|Sakshi

మూడేళ్లలో రూ.21,750 కోట్లకు 

ప్రస్తుతం రూ.8,700 కోట్ల మార్కెట్‌ 

మొబైల్‌ గేమర్స్‌ 36.5 కోట్ల పైమాటే

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్‌ గేమింగ్‌ జోరు మీద ఉంది. కోవిడ్‌–19 పుణ్యమాని స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయిన వారి సంఖ్య పెరిగింది. దీంతో గేమింగ్‌ మార్కెట్‌ 2023 నాటికి భారత్‌లో రూ.21,750 కోట్లకు చేరనుందని పరిశోధన సంస్థ సీఎల్‌ఎస్‌ఏ చెబుతోంది. ప్రస్తుతం ఈ విపణి రూ.8,700 కోట్లుంది. అలాగే 36.5 కోట్ల పైచిలుకు మొబైల్‌ గేమర్స్‌ ఉన్నట్టు అంచనా. ఈ సంఖ్య గణనీయంగా అధికమవుతోంది. ప్రొఫెషనల్‌ గేమర్స్, వ్యూయర్స్‌ పెరుగుతుండడంతో సంప్రదాయ క్రీడల మాదిరిగానే ఈ–స్పోర్ట్స్‌ సైతం వృద్ధి బాటలో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.  

దూసుకెళ్తున్న సంఖ్య.. 
2020 ద్వితీయ త్రైమాసికంలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి గేమ్స్‌ డౌన్‌లోడ్స్‌ 20 శాతం వృద్ధి చెందాయి. అలాగే ఆన్‌డ్రాయిడ్‌ ప్లే స్టోర్‌ నుంచి 51 శాతం అధికమయ్యాయి. గతంలో చాలా ఏళ్లపాటు డిజిటల్‌ సేవలు అణిచివేతకు గురయ్యాయి. ఇంటర్నెట్‌ లేకపోవడం, స్మార్ట్‌ఫోన్లు ఖరీదుగా ఉండడం, అధిక డేటా చార్జీలు, డిజిటల్‌ చెల్లింపుల విధానం అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ప్రస్తుతం 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండడం, చవక డేటా చార్జీలు, స్మార్ట్‌ఫోన్ల విస్తృతి, కోవిడ్‌–19.. వెరశి మొబైల్‌ గేమింగ్‌ అభివృద్ధి చెందుతోందని నివేదిక అంటోంది. డిజిటల్‌ వినియోగం, ఆన్‌లైన్‌ కస్టమర్లు అంతకంతకూ పెరగడం, చవక స్మార్ట్‌ఫోన్లు, డేటా చార్జీలు పరిశ్రమను నడిపిస్తున్నాయి. పీసీ, కన్సోల్‌ గేమింగ్‌ పెద్ద ఎత్తున పెరిగినప్పటికీ, మొబైల్‌ గేమ్స్‌ స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదని సీఎల్‌ఎస్‌ఏ అనలిస్ట్‌ దీప్తి చతుర్వేది అన్నారు. 

ప్రముఖ కంపెనీలు ఇవే.. 
దేశంలో నజారా, డ్రీమ్‌ 11, గేమ్స్‌ 24/7, పేటీఎం ఫస్ట్‌ గేమ్స్, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్, జియో గేమ్స్‌ వంటి కంపెనీలు ప్రముఖంగా నిలిచాయి. గేమింగ్‌ రంగంలో అయిదేళ్లలో రూ.300 కోట్లను నజారా వెచ్చించింది. రూ.100 కోట్లు సమీకరించింది. బిలియన్‌ డాలర్ల కంపెనీగా డ్రీమ్‌ 11 నిలిచింది. గేమ్స్‌ 24/7లో టైగర్‌ గ్లోబల్‌ పెట్టుబడులు ఉన్నాయి. పేటీఎం ప్రమోట్‌ చేస్తున్న పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌కు 4.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. 300 గేమ్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. జియో గేమ్స్‌ను రిలయన్స్‌ జియో, మీడియాటెక్‌ ప్రమోట్‌ చేస్తున్నాయి.  

ప్రపంచవ్యాప్తంగా ఇలా.. 
మీడియా రంగంలో అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో గేమింగ్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా  గేమింగ్‌ మార్కెట్‌ రూ.12 లక్షల కోట్లపైమాటే. ఇందులో మొబైల్‌ గేమింగ్‌ వాటా రూ.5.36 లక్షల కోట్లు. 2016లో మొబైల్‌ గేమింగ్‌ పరిశ్రమ విలువ రూ.2.97 లక్షల కోట్లు. ఇక చైనాలో 5జీ కారణంగా ఈ–గేమింగ్‌కు ఊతమిస్తోంది. భారత్‌లో గేమ్స్, ఆన్‌లైన్‌ అనుభూతి మెరుగవుతుండడంతో వినియోగదార్లు లైవ్‌ ఈవెంట్స్‌ వీక్షణంతోపాటు ప్రైజ్‌ మనీ అందుకోవడానికి పోటీలోకి దిగుతున్నారని నివేదిక వెల్లడించింది.  

మరిన్ని వార్తలు