మొబైల్‌ రేట్లకు రెక్కలు!

3 Oct, 2020 08:09 IST|Sakshi

3 శాతం దాకా పెరిగే అవకాశం

సాక్షి,న్యూఢిల్లీ: డిస్‌ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఇండి యా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువావే, షావోమి, వివో, విన్‌స్ట్రాన్‌ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉంది. ‘మొబైల్‌ ఫోన్ల రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్‌ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

దేశీయంగా దశలవారీగా తయారీని ప్రోత్సహించే కార్యక్రమంలో (పీఎంపీ) భాగంగా డిస్‌ప్లే అసెంబ్లీ, టచ్‌ ప్యానెళ్లపై అక్టోబర్‌ 1 నుంచి దిగుమతి సుంకాలను అమలు చేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా తయారీ పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పీఎంపీని తెరపైకి తెచ్చింది. వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ వల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ సుమారు రూ. 68,000 కోట్ల పెట్టుబడితో 2016లో ట్విన్‌స్టార్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్‌ పేరుతో దేశీయంగా తొలి ఎల్‌సీడీ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు మొదలుకాలేదు. 

మరిన్ని వార్తలు