1.5 లక్షల మొబైల్‌ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం

16 Apr, 2022 01:07 IST|Sakshi

ఈ కామర్స్‌ సంస్థల అనైతికతకు చెక్‌ పెట్టాలి

మొబైల్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

కోల్‌కతా: ఈ కామర్స్‌ సంస్థలు అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణలు, అనైతిక విధానాలతో దేశవ్యాప్తంగా 1.5 లక్షల స్మార్ట్‌ ఫోన్‌ రిటైల్‌ దుకాణాదారుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టు అఖిల భారత మొబైల్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఆర్‌ఏ) పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఈ కామర్స్‌ సంస్థల అనైతిక ధోరణులకు చెక్‌ పెట్టాలని కోరింది.  

చిన్న రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టం
‘‘ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు అనుసరిస్తున్న అనైతిక, వివక్షాపూరిత, గుత్తాధిపత్య వ్యాపార విధానాల వల్ల పరిస్థితి ఎంతో దిగజారింది. కొన్ని రిటైల్‌ షాపులు మూతపడ్డాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టెక్నాలజీ దన్నుతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు అనుసరిస్తున్న అనైతిక, గుత్తాధిపత్య విధానాలతో పోటీపడలేకపోతున్న 1,50,000 రిటైలర్లను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం’’ అని ఏఐఎంఆర్‌ఏ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ బజోరియా తెలిపారు.

ఏప్రిల్‌ 16 నుంచి రెండు రోజుల పాటు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు. ‘‘38 బిలియన్‌ డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు)తో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌. కొన్ని అంతర్జాతీయ మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు 2021లో భారత్‌కు అత్యధికంగా ఫోన్లను ఎగుమతి చేశాయి. దేశ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్‌ వాటా 50 శాతంగా ఉంది’’అని బజోరియా చెప్పారు. చిన్న మొబైల్‌ రిటైలర్లకు జీఎస్‌టీ ఇబ్బందికరంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పెద్ద రిటైలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ, చిన్న రిటైలర్లకు ముప్పుగా పరిణమించే వాతావరణం దేశంలో నెలకొందన్నారు.   

మరిన్ని వార్తలు