ఈ ఏడాదీ మొబైల్‌ టారిఫ్‌ల మోత!

10 Feb, 2022 03:28 IST|Sakshi

రేట్ల పెంపు యోచనలో ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ కాల్‌ టారిఫ్‌ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. ‘2022లో టారిఫ్‌లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు.

పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. 2021 నవంబర్‌లో టారిఫ్‌లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్‌టెల్‌ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్‌పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 163గా ఉంది.

వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్‌పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్‌ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్‌పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్‌ చెప్పారు. నెట్‌వర్క్‌లు .. డివైజ్‌ల అప్‌గ్రెడేషన్, క్లౌడ్‌ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు