మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్‌..! వచ్చే మూడేళ్లలో..!

22 Dec, 2021 16:02 IST|Sakshi

నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో భారీ ప్రణాళికకు సిద్దమైంది. వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌ను సెమికండక్టర్‌ చిప్స్‌ తయారీ కేంద్రంగా మలిచే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది.

వచ్చే మూడేళ్లలో డజను పైగా... 
రాబోయే 2-3 సంవత్సరాలలో కనీసం డజను  సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను భారత్‌లో స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోందని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. చిప్‌ల తయారీ పరిశ్రమ కోసం అందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.  


 

భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా..
చిప్‌ తయారీలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది. అందులో భాగంగా గత వారం దిగ్గజ చిప్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్ల పథకాన్ని ఆమోదించింది. దీంతో  భారత్‌లో సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీని పెంచడానికి ఊతమిచ్చినట్లూ ఉంటుందని అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన సాధించడం, భారీ పెట్టుబడులు తీసుకురావడం, లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ  భారీ ప్రణాళిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, కాంపౌండ్ సెమీకండక్టర్ యూనిట్లు,  డిజైన్, ప్యాకేజింగ్ కంపెనీలు వచ్చే 3-4 నెలల్లో ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు.

 

కోవిడ్‌-19 రాకతో వెంటాడిన సమస్య..!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో పలు దేశాల్లో తీవ్రమైన చిప్‌ కొరత ఏర్పడింది. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలను చిప్స్‌ కొరత అనూహ్యమైన దెబ్బ తీశాయి. వచ్చే ఏడాది చివరి వరకు చిప్‌ కొరత ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు కొంటె భారీగా పన్ను మినహాయింపు.. ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు