పీఎస్‌యూ వాటాల విక్రయంపై దృష్టి

26 Nov, 2022 11:26 IST|Sakshi

జాబితాలో కోల్‌ ఇండియా, హిందుస్తాన్‌ జింక్‌ 

రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ సైతం 

5–10 శాతం వాటా అమ్మకానికి ప్రణాళికలు

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలలో కొద్దిపాటి వాటాల విక్రయంపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ఇంధన దిగ్గజం కోల్‌ ఇండియా, హిందుస్తాన్‌ జింక్‌తోపాటు ఎరువుల కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఆర్‌సీఎఫ్‌)లను ఇందుకు పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా సరికొత్త గరిష్టాలకు చేరిన నేపథ్యంలో ఇందుకు తెరతీయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా జనవరి–మార్చి కాలంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలియజేశాయి. రైల్వే రంగ పీఎస్‌యూసహా 5 కంపెనీలలో 5–10% వాటా విక్రయించే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆఫర్‌ ఫర్‌ సేల్‌: పీఎస్‌యూలలో వాటాల విక్రయానికి ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఆశావహ పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రభుత్వానికి కనీసం రూ. 16,500 కోట్లవరకూ లభించవచ్చని అంచనా. ఆర్థిక వ్యవస్థ పటిష్టత, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రభుత్వానికి మద్దతివ్వగలవని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో పెరుగుతున్న సబ్సిడీ బిల్లుకు తద్వారా కొంతమేర చెక్‌ పెట్టవచ్చని విశ్లేషిస్తున్నారు. కాగా.. పీఎస్‌యూ వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 65,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 

షేర్లు జూమ్‌
గత ఏడాది కాలాన్ని పరిగణిస్తే కోల్‌ ఇండియా షేరు 46%, ఆర్‌సీఎఫ్‌ 58% దూసుకెళ్లాయి. ఇక  తాజాగా ఎన్‌ఎస్‌ఈలో కోల్‌ ఇండియా షేరు రూ. 232 వద్ద నిలవగా.. హింద్‌ జింక్‌ రూ. 297 వద్ద, ఆర్‌సీఎఫ్‌ రూ. 120 వద్ద ముగిశాయి.


 

మరిన్ని వార్తలు