వారాంతానికల్లా మరో వ్యాక్సిన్‌ రెడీ!

16 Dec, 2020 11:58 IST|Sakshi

క్లినికల్ పరీక్షల డేటా ప్రకారం మోడర్నా వ్యాక్సిన్‌కు ఓకే

గురువారానికల్లా యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులకు చాన్స్‌

స్పుత్నిక్‌-వీతో రెండేళ్లపాటు రక్షణ- గమలేయా రీసెర్చ్‌ ప్రకటన

స్పుత్నిక్-వీపై దేశీయంగా డాక్టర్‌ రెడ్డీస్‌ క్లినికల్‌ పరీక్షలు

న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్‌-19 కట్టడికి ఈ వారంలోనే మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. యూఎస్‌ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ ఇందుకు అర్హత సాధించింది. క్లినికల్‌ పరీక్షల డేటాను విశ్లేషించిన యూఎస్‌ఎఫ్‌డీఏ మంగళవారం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మోడర్నా వ్యాక్సిన్‌ వినియోగంపై గురువారం నిపుణుల సలహా కమిటీ సమావేశంకానుంది. కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాక ఈ వ్యాక్సిన్‌ను సైతం అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారికంగా అనుమతించనున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతానికల్లా కరోనా వైరస్‌ కట్టడికి మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశాయి. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు సైతం ఇదే తరహాలో అనుమతులు లభించడంతో సోమవారం నుంచి పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే మోడర్నా వ్యాక్సిన్‌ 94 శాతం సమర్థతను చూపినట్లు క్లినికల్ పరీక్షల డేటా వెల్లడించడంతో వారాంతానికల్లా అందుబాటులోకి రానున్నట్లు హెల్త్‌కేర్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌!)

రెండేళ్లపాటు రక్షణ
రష్యన్‌ సంస్థ గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ రెండేళ్లపాటు రక్షణ నిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ కనీసం రెండేళ్లపాటు రక్షణను కల్పించగలదని గమలేయా హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ తాజాగా పేర్కొన్నారు. బయోఎన్‌టెక్ సహకారంతో ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ 4-5 నెలలపాటు రోగనిరోధక శక్తిని ఇవ్వగలదని ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గమలేయా అంచనాలు నిజమైతే భారత్‌కు ఇది అత్యంత శుభవార్త కాగలదని వ్యాఖ్యానించారు. కాగా.. తమ పరీక్షలలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ 91.4 శాతం సత్ఫలితాలు ఇచ్చినట్లు గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవల వెల్లడించడం గమనార్హం! (తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌- పరీక్షలకు రెడీ)

డాక్టర్ రెడ్డీస్‌ ద్వారా
దేశీయంగా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలను హెల్త్‌కేర్ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ చేపట్టింది. పరీక్షలు విజయవంతమైతే వ్యాక్సిన్‌కు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులను కోరనుంది. తద్వారా దేశీయంగా 10 కోట్ల డోసేజీల సరఫరాకు వీలు కలగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నిజానికి దేశీ వినియోగానికి అనువైన వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణికి అనువైన పరిస్థితులు, అధిక జనాభాకు అందించే వెసులుబాటు, ఆర్థిక భారం తదితర పలు అంశాలను సమీక్షించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు.

>
Poll
Loading...
మరిన్ని వార్తలు