భారత్‌ ఎకానమీకి వెలుగు రేఖలు!

20 Nov, 2020 05:20 IST|Sakshi

గోల్డ్‌మన్‌ శాక్స్‌కు తోడయిన మూడీస్‌

క్షీణ రేటు అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్‌ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్‌–2021 మార్చి మధ్య భారత్‌ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌  గురువారం మైనస్‌ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. 

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ దిగ్గజం–  గోల్డ్‌మన్‌ శాక్స్‌ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్‌ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది.  2020లోసైతం  క్షీణ రేటు అంచనాలను మూడీస్‌ ఇంతక్రితం మైనస్‌ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని  మైనస్‌ 8.9 శాతానికి తగ్గించింది.  కరోనా వైరస్‌ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ (స్వావలంబన భారత్‌) 3.0 పేరుతో కేంద్రం నవంబర్‌ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

   లాక్‌డౌన్‌ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్‌ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.   భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్‌ పాజిటివ్‌’’అని తెలిపింది. 2021–22లో భారత్‌ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం.

ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్‌ సర్వే భరోసా
వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు.  డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్‌ ఈ సర్వే నిర్వహించింది.  నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు.

సెప్టెంబర్‌ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా
జీడీపీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్‌ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా  ఈ సందర్భంగా పేర్కొంది.

2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్‌ఫర్డ్‌ ఎకానమీస్‌
భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్‌ఫర్డ్‌ ఎకానమీస్‌ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది.

పలు సంస్థల అంచనాలు ఇలా...
కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్‌ సంస్థలు 2020–21లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ  క్షీణ రేటు 8 శాతం నుంచి  11% వరకూ ఉంటుందని అంచనావేశాయి.

ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో)
సంస్థ    క్షీణత అంచనా
కేర్‌    8.2
యూబీఎస్‌    8.6  
ఎస్‌అండ్‌పీ    9
ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌    9
ఆర్‌బీఐ    9.5  
ప్రపంచబ్యాంక్‌    9.6
ఫిచ్‌    10.5
ఎస్‌బీఐ ఎకోర్యాప్‌    10.9
ఇక్రా    11
ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌    11.8
ఐఎంఎఫ్‌    10.3

మరిన్ని వార్తలు