భారత్‌ ఎకానమీకి సమీపంలో సవాళ్లే!

21 Jan, 2021 12:22 IST|Sakshi

ఫైనాన్షియల్‌ రంగంలో బలహీనతలు: ఫిచ్‌

రాష్ట్రాలకు ద్రవ్యలోటు కష్టాలు : క్రిసిల్‌ నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: సంస్కరణల అమల్లో బలహీనతలు, ఫైనాన్షియల్‌ రంగంలో ఇబ్బందులు సమీపకాలంలో భారత్‌ వృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండడానికి కారణమవుతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయడింది. ఆయా సమస్యల వల్ల తన శక్తిసామర్థ్యాలకన్నా తక్కువ స్థాయిలో సమీపకాలంలో భారత్‌ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఫిచ్‌ విశ్లేషించింది. కోవిడ్‌–19 మహమ్మారితో స్తంభించిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో సంస్కరణల అజెండా ఒకటని పేర్కొంది. సమీపకాలంలో భారత్‌ వృద్ధిబాటలో సంస్కరణల పటిష్ట అమలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొంది. అలాగే పెట్టుబడులు, కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌ వంటి అంశాల విషయంలో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషించింది. 

వ్యవసాయ రంగంలో మార్పులు 
వ్యవసాయరంగంలో తీసుకువచ్చే సంస్కరణల వల్ల ఈ రంగంలో సామర్థ్యం పెరుగుతుందని, మధ్యదళారీ వ్యవస్థతో పనిలేకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారుకు విక్రయించగలుగుతారని పేర్కొంది. తద్వారా రైతులకు ఒకపక్క తగిన ఆదాయం లభిస్తుందని, మరోపక్క వినియోగదారులపై ధరాభారం తగ్గుతుందని వివరించింది. అయితే వ్యవసాయ సంస్కరణల అమల్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని ఫిచ్‌ విశ్లేషించింది.  

కార్మిక సంస్కరణలతో ప్రయోజనాలు 
ఇక కార్మిక మార్కెట్‌లో చట్ట సంస్కరణల వల్ల సామాజిక భద్రతా విషయంలో కార్మికుని పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపింది. ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ప్రయోజనాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడింది. వృతి పరమైన భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని వివరించింది. కార్మిక వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవడానికీ ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషించింది. చిన్న స్థాయి కార్మికులు వివిధ రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సంపాదించుకోగలుగుతారని పేర్కొంది. ఆయా సంస్కరణలు భారత్‌ కార్మిక మార్కెట్‌ను శక్తివంతంగా మలుస్తాయని వివరించింది.  ‘‘సమీప కొద్ది సంవత్సరాల్లో కేంద్రం వివిధ రంగాల్లో పటిష్ట సంస్కరణల బాటలో పయనిస్తుందని ముము విశ్వసిస్తున్నాము. అయితే ఇదే సమయంలో అమలు విషయంలో మాత్రం క్లిష్ట పరిస్థితులు తప్పవని భావిస్తున్నాము’’ అని నివేదిక   వరించింది. 

2021-22లో 11 శాతం వృద్ధి 
2021 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ 9.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశం 11 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని రేటింగ్‌ ఏజెన్సీ అంచనావేసింది. 2018–19లో భారత్‌ ఆర్థికాభివృద్ధి 6.1 శాతం. వాణిజ్య యుద్ధం సహా పలు కారణాల వల్ల 2019–20లోనే 10 సంవత్సరాల కనిష్ట స్థాయి 4.2 శాతానికి తగ్గిపోయింది. 2020–21లో కరోనాతో మాంద్యంలోకి జారిపోతున్న పరిస్థితి. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నమోదవగా, సెప్టెంబర్‌లో ఈ క్షీణత 7.5 శాతానికి పరిమితమైంది. ద్వితీయార్థంలో ఎంతోకొంత వృద్ధి నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి.  

ఆదాయ  వ‍్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంశానికి సంబంధించి రాష్ట్రాలకు తీవ్రక్లిష్ట పరిస్థితులు ఎదురు కానున్నాయని రేటింగ్‌, ఆర్థికవిశ్లేషణా సంస్థ క్రిసిల్‌ తన తాజా అధ్యయనం నివేదికలో తెలిపింది. స్థూల రాష్ట్రాల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో దాదాపు 90 శాతం వాటా ఉన్న 18పెద్ద రాష్ట్రాల గణాంకాల పరిశీలన, విశ్లేషణ అనంతరం తాజా నివేదిక రూపకల్పన జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

  • రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి లో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం.  
     
  • పన్ను వసూళ్లు క్రమంగా రికవరీ అవుతున్నప్పటికీ, అధిక వడ్డీరేట్ల సమస్య నెలకొనే పరిస్థితి ఉంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు చేసే రుణ సమీకరణలు ఇందుకు ఒక కారణం.  

  • ప్రభుత్వాలకు రెవెన్యూ వ్యయాల విషయంలో కూడా క్లిష్టపరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకపక్క వేతనాలు పెన్షన్లు, వడ్డీరేట్ల భారం మరోపక్క మహమ్మారి కరోనా కట్టడికి ఆరోగ్యరంగంపై అలాగే కార్మిక సంక్షేమానికి చేయాల్సిన వ్యయాలు ఈ విషయంలో నెలకొన్న క్లిష్టతకు మూలం.  
     
  • అధిక రెవెన్యూ లోటు పరిస్థితి రాష్ట్రాల మూలధన వ్యయాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరిన్ని రుణలకు రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల మూలధన వ్యయాలు  వచ్చే యేడాదికానీ పెరిగే పరిస్థితి లేదు.  
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికికానీ, రెవెన్యూ ఆదాయాలు కోవిడ్‌ ముందస్తు స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2021–22లో 10 శాతం జీడీపీ వృద్ధి జరుగుతుందని అంచనా.  
     
  • కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని రేటింగ్‌ దిగ్గజం స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ అనుబంధ పరిశోధనా విభాగం కూడా అయిన క్రిసిల్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ అంచనాలకు క్రితం 9 శాతం నుంచి 7.7 శాతానికి ఇప్పటికే మెరుగుపరచింది. అయితే ప్రభుత్వ వ్యయాల విషయంలో ఉన్న పరిమితులు వృద్ధికి అడ్డంకని తన తాజా నివేదికలో  విశ్లేషించింది.  
     
  • ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి  సంబంధించి ద్రవ్యలోటు (కేంద్ర రాష్ట్రాలు కలిపి) ప్రస్తుత ఆర్థిక సంవతసరం 12 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలో ఉండే వీలుందన్న ఇక్రా అంచనాల నేపథ్యంలో తాజా క్రిసిల్‌ అధ్యయన నివేదిక వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 8.5 శాతానికి తగ్గవచ్చని ఇక్రా అంచనావేసింది.  
మరిన్ని వార్తలు