2022లో కొనసాగనున్న ఐపీవోల హవా

23 Dec, 2021 10:34 IST|Sakshi

రూ. 2 లక్షల కోట్ల సమీకరణకు కంపెనీల క్యూ 

ఇప్పటివరకూ రూ. 1.35 లక్షల కోట్లతో 2021 రికార్డ్‌  

ముంబై:వచ్చే ఏడాది(2022)లో పబ్లిక్‌ ఇష్యూలు వెల్తువెత్తనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే 65 కంపెనీలు రూ. 1.35 లక్షల కోట్ల(15.3 బిలియన్‌ డాలర్లు)ను సమీకరించడం ద్వారా సరికొత్త రికార్డుకు తెరతీసిన నేపథ్యంలో నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ బాటలో వచ్చే ఏడాది సైతం ప్రైమరీ మార్కెట్‌ మరింత కళకళలాడనున్నట్లు నివేదిక తెలియజేసింది. వెరసి ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 2 లక్షల కోట్ల(26 బిలియన్‌ డాలర్లు)వరకూ సమకూర్చుకునే వీలున్నట్లు వెల్లడించింది. ఇక గతేడాది(2020)లో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా కంపెనీలు కేవలం 4.2 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. ఈ బాటలో గత మూడేళ్ల కాలాన్ని కలిపి చూసినప్పటికీ నిధుల సమీకరణ, లిస్టింగ్స్‌రీత్యా 2021 అత్యధికంకావడం విశేషం! 


కొత్త తరం కంపెనీలు 
నివేదిక ప్రకారం వచ్చే ఏడాదిలో కొత్త తరం టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్, రియల్టీ, స్పెషాలిటీ కెమికల్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు ప్రైమరీ మార్కెట్లో పాగా వేయనున్నాయి. ఇప్పటికే 15 బిలియన్‌ డాలర్ల సమీకరణకు అనుమతించమంటూ కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇకపై మరో 11 బిలియన్‌ డాలర్ల విలువైన ఇష్యూలు సెబీకి క్యూ కట్టే అవకాశముంది. వీటిలో పలు లార్జ్‌క్యాప్, మిడ్‌ క్యాప్‌ కంపెనీలుండటం గమనార్హం!    

చదవండి: ఇష్యూ ధర సహేతుకంగా ఉండాలి.. లేదంటే ?
 

>
మరిన్ని వార్తలు