sebi: కంపెనీల్లో మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయ్‌

8 Oct, 2021 07:58 IST|Sakshi

ముంబై: ఇటీవల ఓవైపు ఈక్విటీలలో రిటైల్‌ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుంటే.. మరోపక్క కంపెనీలలో మోసాలు సైతం అధికంగా బయటపడుతున్నట్లు సెబీ అధికారి ఎస్‌కే మొహంతీ పేర్కొన్నారు. ఇది ప్రమాదకర ట్రెండ్‌ అంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ మొహంతీ వ్యాఖ్యానించారు. 

పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో భాగంగా ప్రసంగిస్తూ వీటికి చెక్‌ పెట్టవలసిన అవసరమున్నదని స్పష్టం చేశారు. క్రోల్‌ పాయింట్స్‌ నిర్వహించిన ఒక సర్వేను ప్రస్తావిస్తూ ఈ ఏడాది 65 శాతం కంపెనీలలో మోసాలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో స్టాక్‌ మార్కెట్లలో 1.5 కోట్లమంది కొత్త రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రవేశించినట్లు తెలియజేశారు. రిటైలర్లు పెట్టుబడుల కొనసాగింపులో సహనంతో వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే మోసాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చాలా చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దీంతో ఇన్వెస్టర్లలో చైతన్యం, అవగాహన, విజ్ఞానం వంటి అంశాలను పెంపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. 

మోసాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయడంతోపాటు, పెట్టుబడుల విలువనూ దెబ్బతీస్తాయని మొహంతీ వివరించారు. షేర్ల ధరలపై ప్రభావం చూపగల సమాచారాన్ని పొందడం ద్వారా కొంతమంది తమకు సంబంధించిన వ్యక్తులు లబ్ది పొందేందుకు సహకరిస్తుంటారని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు మరింత పెరిగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే మోసాలకు పాల్పడేవారికి చెక్‌ పెట్టే బాటలో సెబీ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగానే సాధారణ దర్యాప్తు విభాగం నుంచి గతేడాది కార్పొరేట్‌ మోసాల పరిశోధన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

ఐబీ వెంచర్స్‌కు జరిమానా 
ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో ఒక సంస్థతోపాటు.. కంపెనీ సీఈవోసహా నలుగురికి సెబీ జరిమానా విధించింది. కంపెనీ షేర్లకు సంబంధించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల కేసు సెటిల్‌మెంట్‌ చార్జీల కింద రూ. 5 కోట్ల జరిమానా చెల్లించమంటూ ఆదేశించింది. సెటిల్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో కంపెనీ సీఈవో దివ్యేష్‌ బి.షాతోపాటు మరో ముగ్గురు బంధువులున్నారు. అంతేకాకుండా విక్రమ్‌ ఎల్‌ దేశాయ్‌ హెచ్‌యూఎఫ్‌ సైతం దరఖాస్తు చేసింది. 2018 ఏప్రిల్‌ 2–23 మధ్య కంపెనీ ఆర్థిక ఫలితాలు, డివిడెండ్‌ అంశంలో సమాచారాన్ని దుర్వినియోగ పరచినట్లు దర్యాప్తు వెల్లడించింది.     

సెలిబ్రస్‌ కమోడిటీస్‌కు షాక్‌ 
జాతీయ స్పాట్‌ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్‌)లో చట్ట విరుద్ధంగా కాంట్రాక్టులు చేపట్టేందుకు క్లయింట్లను అనుమతించిన కేసులో సెలిబ్రస్‌ కమోడిటీస్‌ లిమిటెడ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. కాంట్రాక్టులను అనుమతించడంలో నిబంధనలకు నీళ్లొదిలి అవకతవకలకు పాల్పడటంతో రిజిస్ట్రేషన్‌ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్‌ఎస్‌ఈలో సభ్యత్వం కలిగిన బ్రోకింగ్‌ సంస్థ సెలిబ్రస్‌ కమోడిటీస్‌ పెయిర్డ్‌ కాంట్రాక్టుల నిర్వహణకు అనుమతులు పొందింది.   

మరిన్ని వార్తలు