ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 2022లో పండగే..!

9 Jan, 2022 15:24 IST|Sakshi

మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని చూస్తున్నారా? అయితే, కొద్ది నెలలు ఓపిక పట్టండి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ కాబోతున్నాయి. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఎక్కువ వృద్ధిని కనబరిచిన దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు, సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎస్ఎమ్ఈవీ) భారతదేశంలో ఈ ఏడాది మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సుమారు 10 లక్షల యూనిట్లుగా ఉంటాయని తెలిపింది. ఈ సంఖ్య గత 15 సంవత్సరాలలో విక్రయించిన దానికి సమానం.

2020లో 1,00,736 యూనిట్లతో పోలిస్తే 2021లో 2,33,971 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయించినట్లు ఎస్ఎమ్ఈవీ ఒక ప్రకటనలో తెలిపింది. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్  డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. "గత 15 సంవత్సరాలలో సుమారు 1 మిలియన్ ఈ2డబ్ల్యు, ఈ-త్రీ వీలర్లు, ఈ-కార్లు, ఈ-బస్సులను విక్రయించాము. జనవరి 2022 నుంచి కేవలం ఒక సంవత్సరంలో 1 మిలియన్ యూనిట్లను విక్రయించే అవకాశం" ఉంది అని అన్నారు. హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్(ఫేమ్ 2) వంటి ప్రభుత్వ విధానాలు ఎలక్ట్రిక్ వాహనాల విపరీతమైన డిమాండ్‌కు ప్రధాన కారణం అని గిల్ పేర్కొన్నారు. 

5-6 రెట్లు వృద్ధి
ఆకర్షణీయమైన ధరలు, తక్కువ నిర్వహణ, వ్యయ ఖర్చులు వంటి కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుత మార్కెట్ గణాంకాల ప్రకారం గత 12 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పరంగా భారతదేశం 5-6 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2020లో హైస్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్(ఈ2డబ్ల్యులు) అమ్మకాలు 27,206 యూనిట్లతో పోలిస్తే 2021లో 1,42,829 యూనిట్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్ఎమ్ఈవీ పేర్కొంది. 2020తో పోలిస్తే 425 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది. 

(చదవండి: సామాన్యుడినే కాదు..! డీమార్ట్‌నుకూడా వదల్లేదు..!)

మరిన్ని వార్తలు