ఎకానమీని గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్‌!?

27 May, 2021 02:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్‌ తప్పదని భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కొటక్‌ అభిప్రాయపడ్డారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి సహాయక ప్యాకేజ్‌ని ప్రకటించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చిన్న పరిశ్రమలకు హామీ రహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌ కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలించాలని ఒక ఇంటర్వ్యూలో కోరారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజ్‌లో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఏప్రిల్, మే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపివేసిందని కొటక్‌ అన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను కొటక్‌ ప్రస్తావిస్తూ, ‘‘నిజానికి బేస్‌ ఎఫెక్ట్‌తో చూసుకున్నా, వృద్ధి రెండంకెల దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని వేచి చూడాల్సి ఉంది’’ అని అన్నారు. 

ఇప్పటికి ప్యాకేజ్‌లు ఇలా... 
2020లో కేంద్రం కరోనాను ఎదుర్కొనడానికి ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజ్‌ని ప్రకటించింది. ఈ విలువ రూ. 27.1 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ విలువ 13 శాతం అని కేంద్రం ప్రకటించినప్పటికీ, ద్రవ్య పరంగా ఇది 2 శాతం దాటబోదని అంచనా. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దాదాపు రూ. 30 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీలను దశలవారీగా ప్రకటించింది. ఈ మొత్తం జీడీపీలో దాదాపు 15%. ఇటీవల మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమేనని పేర్కొంది. ఇందులోనూ కార్పొరేట్‌ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయని విశ్లేషించింది.

లాక్‌డౌన్లు సడలించే సమయంలో ప్రకటించే అవకాశం: బెర్న్‌స్టెయిన్‌ 
సెకండ్‌ వేవ్‌ కట్టడికి వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న లాక్‌డౌన్లు, సంబంధిత ఆంక్షలు సడలించే సమయంలో కేంద్రం మరోదఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ బెర్న్‌స్టెయిన్‌ అంచనావేసింది. ఏప్రిల్, మే నెలల్లో భారత్‌ ఆర్థిక క్రియాశీలత తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని తన సూచీలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఇంధన వినియోగం, విద్యుత్‌ డిమాండ్, ఈ–వే బిల్లులు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాల్లో ప్రతికూల గణాంకాలు నమోదవుతున్నట్లు వివరించింది. అలాగే సరఫరాల సమస్యలూ తీవ్రమైనట్లు పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం పరిస్థితులు కొంత అదుపులో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సెకండ్‌వేవ్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా, అది మొదటివేవ్‌ అంత తీవ్రంగా లేదని విశ్లేషించింది. 

మరిన్ని వార్తలు