సంస్కరణలతో వృద్ధి వేగవంతం

19 Oct, 2021 06:19 IST|Sakshi

భారత్‌పై ఐఎంఎఫ్‌ విశ్లేషణ

ఎయిర్‌ ఇండియా విక్రయం కీలక మైలురాయిగా వ్యాఖ్య  

న్యూఢిల్లీ: సంస్కరణలు, సరళీకరణ విధానాల బాటలో మరింత ముందుకు వెళ్లడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా బయటపడుతుందని, అంతర్జాతీయంగా మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఎయిర్‌ ఇండియా విక్రయం ఒక మైలురాయిగా అభివరి్ణంచింది.

పలు దేశాలకు వ్యాక్సినేషన్‌ సరఫరాలను చేసి కోవిడ్‌–19 మహమ్మారిపై పోరులో భారత్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని కూడా పేర్కొంది. కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో భారత్‌ భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం సానుకూల అంశమని ఐఎంఎఫ్‌–ఎస్‌టీఐ ప్రాంతీయ శిక్షణా సంస్థ డైరెక్టర్, ఐఎంఎఫ్‌ (ఇండియా) మాజీ మిషన్‌ చీఫ్‌  ఆ్రల్ఫెడ్‌ షిప్కే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► ఇటీవలి సంవత్సరాలలో వ్యవసాయం, రక్షణ, టెలికమ్యూనికేషన్‌ సేవలు, బీమా రంగాల్లో ప్రభుత్వ ఇటీవలి సరళీకరణ విధానాలు దేశానికి భారీగా ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి దోహదపడ్డాయి. ఇది కరెంట్‌ ఖాతా ఫైనాన్సింగ్‌ పరిస్థితిని మెరుగుపరిచింది. దీనితోపాటు అంతర్జాతీయ ఒడిదుడుకులను భారత్‌ తట్టుకోడానికి దోహదపడింది. బయోటెక్నాలజీ, రక్షణ, డిజిటల్‌ మీడియా, ఔషధ రంగాల వంటి కీలక విభాగాల్లో సరళీకరణల వల్ల దేశం మరింత భారీగా ఎఫ్‌డీఐఅను ఆకర్షించే అవకాశం ఉంది.  
► ఆయా సరళీకరణ విధానాలకు భూ, కార్మిక రంగాలకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలూ మద్దతునివ్వాలి. అలాగే పాలనా, నియంత్రణ, న్యాయ వ్యవస్థల మరింత పటిష్టతకు సంస్కరణలను అనుసరించాలి.  
► మహమ్మారి వల్ల గడచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహమ్మారి నుంచి అందరూ బైటపడేంతవరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాబోరు.  
► మహమ్మారి ప్రభావం నుంచి వ్యవస్థలు బయటపడ్డానికి భారత్‌ ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన పలు పాలనా, ద్రవ్యపరమైన చర్యలు సత్ఫలితాలను అందించాయి. సామాన్యుని ఆహార భద్రతకు కేంద్రం చర్యలు హర్షణీయం.  
► ఆరోగ్య రంగంలో అన్ని దేశాల సన్నిహిత సమన్వయం అవసరం. ప్రత్యేకించి వ్యాక్సినేషన్‌ విషయంలో ఇది కీలకం. తద్వారానే ప్రపంచం మహమ్మారి సవాళ్ల నుంచి బయటపడగలుతుంది. వైద్యరంగంతోపాటు విద్యా రంగంలో  పురోగతి సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ మేరకు ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు