స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్త!

19 May, 2022 20:48 IST|Sakshi

ముంబై: భారత వృద్ది రేటు అంచనాలను 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు గాను 30 బేసిస్‌ పాయింట్ల మేర మోర్గాన్‌ స్టాన్లీ తగ్గించింది. స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోవచ్చంటూ హెచ్చరించింది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 7.9 శాతంగా ఈ సంస్థ ప్రకటించింది. 2023–24లో వృద్ధి రేటు 6.7 శాతానికి క్షీణిస్తుందని తెలిసింది. గత అంచనా 7 శాతంగా ఉంది. అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అధిక కమోడిటీల ధరలు, అంతర్జాతీయ క్యాపిటల్‌ మార్కెట్లలో రిస్క్‌తీసుకునే ధోరణి తగ్గడం భారత్‌ వృద్ధి రేటు క్షీణతకు రిస్క్‌లుగా పేర్కొంది.

‘‘అధిక ద్రవ్యోల్బణం, బలహీన వినియోగ డిమాండ్, ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం (రేట్ల పెంపు) అన్నవి వ్యాపార సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి మూలధన రికవరీని ఆలస్యం చేయవచ్చు’’అని మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా విడుదల చేసి నివేదికలో పేర్కొంది. సరఫరా వైపు ప్రభుత్వం తీసుకునే చర్యల మద్దతు, వ్యాపార కార్యకాలపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం అన్నవి ఈ రిస్క్‌ల ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 2022–23కు 6.5 శాతం, కరెంటు ఖాతా లోటు పదేళ్ల గరిష్ట స్థాయి 3.3 శాతానికి చేరుకోవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది.    
 

మరిన్ని వార్తలు