భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు - మహీంద్రా బొలెరో నుంచి టాటా నెక్సాన్ వరకు..

22 Apr, 2023 17:15 IST|Sakshi

2023 ఏప్రిల్ 01 నుంచి బిఎస్-6 ఫేజ్ 2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయడానికి సన్నద్ధమైపోతున్నాయి. మరి కొన్ని సంస్థలు ఉన్న కార్లను సరసమైన ధరలతో విక్రయించడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది మార్కెట్లో సరసమైన ధర వద్ద లభించే డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz):
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభిస్తున్న పాపులర్ డీజిల్ కారు. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10.40 లక్షల మధ్య ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో 90 హెచ్‌పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ దేశంలో మిగిలి ఉన్న ఏకైక డీజిల్‌ హ్యాచ్‌బ్యాక్.

మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo):
మహీంద్రా బొలెరో నియో కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ కారణంగా తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 9.62 లక్షల నుంచి రూ. 12.14 లక్షలు. ఈ కారు 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ కలిగి 100 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

మహీంద్రా బొలెరో (Mahindra Bolero):
మహీంద్రా బొలెరో మన జాబితాలో తక్కువ ధరలో లభించే ఉత్తమైన డీజిల్ కారు. ఇది రూ. 9.78 లక్షల నుంచి రూ. 10.79 లక్షల మధ్య లభిస్తుంది. ఇది 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో డీజిల్‌ ఇంజిన్‌తో 76 హెచ్‌పి పవర్ 210 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి ఉత్తమ మైలేజ్ అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యువి300 (Mahindra XUV300):
ఎక్స్‌యువి300 మహీంద్రా కంపెనీకి చెందిన బెస్ట్ డీజిల్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 9.90 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్య ఉంది. మహీంద్రా ఎక్స్‌యువి300 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ ద్వారా 117 హెచ్‌పి పవర్ 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ పొందుతుంది.

కియా సోనెట్ (Kia Sonet):
దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ దేశీయ విఫణిలో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తున్న SUV లలో ఒకటి సోనెట్. ఈ డీజిల్ కారు ధర రూ. 9.95 లక్షల నుంచి రూ. 14.89 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్ అనే మూడు ఇంజిన్ ఎంపికలతో విక్రయిస్తోంది. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్‌ ఇంజిన్ 116 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 

టాటా నెక్సాన్ (Tata Nexon):
భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్లలో ఒకటి టాటా నెక్సాన్. టాటా నెక్సాన్ డీజిల్ మోడల్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13.70 లక్షల మధ్య ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ద్వారా 115 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మంచి మైలేజ్ అందించే వాహనాల్లో కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు