Most Liveable City On World: ఈ గ్రహం మీద అదే గొప్పదట, పోదామా పోదామా.. వియన్నా!

23 Jun, 2022 13:27 IST|Sakshi

పారిస్: ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా దెబ్బతిన్న ఆస్ట్రేలియా నగరం ఆక్లాండ్  34వ స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా వియన్నా టాప్‌లోకి దూసుకొచ్చింది. అలాగే ఈ ఏడాది  కూడా  సిరియా రాజధాని డమాస్కస్ ఈ గ్రహం మీద అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 173 నగరాల్లో ఒక వ్యక్తి జీవనశైలికి ఎదురయ్యే సవాళ్లను  పరిగణనలోకి తీసుకుంటుంది.

కరోనా కారణంగా మ్యూజియంలు, రెస్టారెంట్లు మూవేత కారణంగా  2021 ప్రారంభంలో  ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయిన వియన్నా, తిరిగి 2018, 2019 మాదిరిగా టాప్‌లోకి వచ్చిందని నివేదిక పేర్కొంది. వియన్నా తర్వాత డానిష్ రాజధాని కోపెన్‌హాగన్‌ రెండు, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, కెనడాలోని  కాల్గరీ  సంయుక్తగా  మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి.


కోపెన్‌హాగన్‌

వాంకోవర్ ఐదవ స్థానంలో, స్విస్ నగరం జెనీవా ఆరో స్థానంలో, జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్ ఏడో స్థానంలో,  టొరంటో ఎనిమిదో స్థానంలో, నెదర్లాండ్స్‌కు చెందిన ఆమ్‌స్టర్‌డామ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వార్షిక నివేదికను  గురువారం ప్రచురించింది. 


డమాస్కస్

ఫిబ్రవరి చివరలో రష్యా వార్‌ తర్వాత ఉక్రేనియన్ రాజధాని కైవ్ ఈ సంవత్సరం ఈ జాబితాలో చోటు కోల్పోయింది. ఈఐయూ సర్వేలో ఈ నగరాన్ని పరిగణనలోకి  తీసుకోలేదు. అలాగే "సెన్సార్‌షిప్", పాశ్చాత్య ఆంక్షల ప్రభావంపై రష్యన్ నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ ర్యాంకింగ్‌లలో కిందికి పడిపోయాయి. రష్యా రాజధాని మాస్కో 15 స్థానాలు క్షీణించగా, సెయింట్ పీటర్స్‌బర్గ్ 13 స్థానాలు దిగజారింది.

మొదటి పది నగరాల్లో ఆరు నగరాలు యూరప్‌వి కావడం విశేషం. జపాన్‌కు చెందిన ఒసాకా, ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్‌లు పదో స్థానాన్ని దక్కించుకోగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ గతేడాదితో పోలిస్తే 23 స్థానాలు ఎగబాకి 19వ స్థానంలో నిలిచింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ కెనడాలోని మాంట్రియల్ కంటే 24వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్ రాజధాని లండన్ ప్రపంచంలో అత్యంత నివసించదగిన నగరాలలో 33వ స్థానంలో ఉంది.


పారిస్‌

స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా మాడ్రిడ్ వరుసగా 35, 43 స్థానాల్లో నిలిచాయి. ఇటలీకి చెందిన మిలన్ 49వ ర్యాంక్‌లో,  న్యూయార్క్ 51వ స్థానంలో, చైనాలోని బీజింగ్ 71వ స్థానంలో నిలిచాయి. అలాగే 2020 పోర్ట్ పేలుడుతో సర్వ నాశనమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్, రాజధాని బీరుట్ కూడా ర్యాంకింగ్‌లో జాబితాలో చోటు  కోల్పోయింది.  

మరిన్ని వార్తలు