ఎంఫసిస్‌- పీఎన్‌సీ ఇన్‌ఫ్రా.. ధూమ్‌ధామ్

24 Jul, 2020 13:03 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

11 శాతం దూసుకెళ్లిన ఎంఫసిస్‌

ఈపీసీ ప్రాజెక్టుల దన్ను

పీఎన్‌సీ ఇన్‌ఫ్రా 6 శాతం హైజంప్

మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎంఫసిస్‌ లిమిటెడ్‌ వెలుగులోకి వచ్చింది. మరోవైపు రెండు ఈపీసీ ప్రాజెక్టులను గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎంఫసిస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎంఫసిస్‌ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 275 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 11 శాతం వృద్ధితో రూ. 2,288 కోట్లను తాకింది. విదేశీ మార్కెట్ల నుంచి క్యూ1లో 25.9 కోట్ల డాలర్ల(రూ. 1940 కోట్లు) విలువైన కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ తెలియజేసింది. దీనికితోడు జులైలో తాజాగా 21.6 కోట్ల కొత్త డీల్స్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎంఫసిస్‌ షేరు 11.4 శాతం దూసుకెళ్లి రూ. 1091 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1098 వరకూ ఎగసింది. గత మూడు నెలల్లో ఈ షేరు 55 శాతం ర్యాలీ చేయడం విశేషం!

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి రెండు ఈపీసీ ప్రాజెక్టులను పొందినట్లు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ తాజాగా పేర్కొంది. భారత్‌మాల పరియోజనలో భాగంగా వీటి సంయుక్త విలువ రూ. 1548 కోట్లుకాగా.. రెండేళ్లలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. గుజరాత్‌లోని పంచ్‌మహల్‌ జిల్లాతోపాటు.. వడోదర జిల్లాలోనూ 8 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికిగాను లభించిన ఈ ఆర్డర్ల విలువను రూ. 758.5 కోట్లు, రూ. 789.5 కోట్లుగా వివరించింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 149 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 152ను సైతం అధిగమించింది. 

మరిన్ని వార్తలు