ఎంజాయ్‌ చేయడం లేదని జాబ్‌ పీకేశారు.. కోర్టుకెక్కిన ఉద్యోగి!

26 Nov, 2022 17:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. లాభదాయకంగా లేని వ్యాపారాల్ని మూసివేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఉద్యోగులు నవ్వలేదని ఫైర్‌ చేస్తుంది.

2015లో జర్మనీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ క్యూబిక్ పార్టనర్స్ సంస్థ ‘మిస్టర్‌ టి’ అనే ఉద్యోగికి పింక్‌ స్లిప్‌ జారీ చేసింది. అతను చేసిన తప్పల్లా ఒక్కటే. ఆఫీస్‌లో ఫన్‌గా ఉండక పోవడం, వీకెండ్స్‌లో ఆఫీస్‌ అయిపోయిన తర్వాత సహచర ఉద్యోగులతో కలిసి మందు కొట్టకపోవడంలాంటి కారణాలు చూపెట్టి అతన్ని ఇంటికి పంపించేసింది. దీంతో సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. 

తాజాగా ఆ కేసు విచారణలో భాగంగా ఉద్యోగి పారిస్‌ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని, సంస్థ సిబ్బందితో వీకెండ్స్‌లో పబ్‌లు, పార్టీలకు రావడం లేదని క్యూబిక్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. కాబట్టే ‘వృత్తిపరమైన అసమర్థత’గా పరిగణలోకి తీసుకుంటూ అతనిపై వేటు వేసినట్లు విన్నవించింది. 

సంస్థ వివరణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ టి’ని సెమినార్లు, పబ్స్‌ బలవంతంగా పాల్గొనేలా హక్కు కంపెనీకి లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. విచ్చలవిడితనం, బెదిరింపులు, రెచ్చగొట్టడం, గొడవ పెట్టుకోవడంలాంటివి ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. ఏదేమైనా పని గంటల తరువాత ఆఫీస్‌ నిర్వహించే పార్టీల్ని నిరాకరించే హక్కు ఆ ఉద్యోగికి ఉందని స్పష్టం చేసింది. కాబట్టి తన మాజీ ఉద్యోగికి నష్టపరిహారంగా 2,574 పౌండ్లు (సుమారు రూ. 2.54 లక్షలు) చెల్లించాలని క్యూబిక్ పార్ట్‌నర్స్‌ను ఆదేశించింది.

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో నష్టపరిహారాల రూపంలో మరో 395,630 పౌండ్లు (సుమారు రూ. 3.90 కోట్లు) కావాలన్న మిస్టర్ టి డిమాండ్‌ను కోర్టు   పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. మిస్టర్ టి 2011లో సంస్థలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2014లో డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మరుసటి ఏడాది ఉద్యోగం నుంచి క్యూబిక్‌ తొలగి౦చింది.

చదవండి👉 ‘ట్విటర్‌లో మా ఉద్యోగాలు ఊడాయ్‌’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు

మరిన్ని వార్తలు