బెక్టర్స్‌ ఫుడ్‌ విజయం వెనుక మహిళ

19 Dec, 2020 10:58 IST|Sakshi

1978లో ప్రారంభమైన రజనీ బెక్టర్‌ ఆలోచన

రూ. 20,000 పెట్టుబడితో బిజినెస్ షురూ

ఈ ఏడాదిలో రూ. 1,000 కోట్లకు టర్నోవర్

‌ఉత్తరాదిన బిస్కట్లు, బేకరీ ఫుడ్స్‌కు ప్రసిద్దం

ఆరు తయారీ యూనిట్లు- 4,000 మందికి ఉపాధి

ముంబై, సాక్షి: రెండు రోజుల క్రితమే ముగిసిన పబ్లిక్‌ ఇష్యూ ద్వారా మార్కెట్లో రికార్డ్‌ సృష్టించిన బెక్టర్స్‌ ఫుడ్‌ విజయాన్ని పరిశీలిస్తే.. ప్రతీ వ్యాపార విజయం వెనుకా ఒక మహిళ ఉంటుందని.. పాత సామెతను చదువుకోవాలేమో? 2020లో వచ్చిన ఐపీవోలలోకెల్లా అత్యధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిన కంపెనీగా బెక్టర్స్‌ ఫుడ్‌ నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం(17)తో ముగిసిన ఇష్యూకి ఏకంగా 198 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. కంపెనీ ప్రస్థాన వివరాలిలా.. (బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్)

తొలుత నష్టాలు..
బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ను 1978 ప్రాంతంలో రజనీ బెక్టర్‌ ప్రారంభించారు. కేవలం రూ. 20,000 పెట్టుబడితో ఐస్‌క్రీముల తయారీ ద్వారా వ్యాపారంలోకి ప్రవేశించారు. పంజాబ్‌లోని లూఢియానాలో ప్రారంభమైన వ్యాపారం ప్రస్తుతం ఆరు యూనిట్లకు ఎగసింది. ఫిల్లౌర్‌, రాజ్‌పురా, తహిల్వాల్‌, గ్రేటర్‌ నోయిడా, ఖోపోలీ, బెంగళూరుల్లో తయారీ యూనిట్లున్నాయి. దేశ విభజన సమయంలో రజనీ బెక్టర్‌ కుటుంబం లాహోర్‌ నుంచి ఢిల్లీకి తరలివచ్చింది. తదుపరి లూఢియానాకు చెందిన ధరమ్‌వీర్ బెక్టర్‌ను రజనీ వివాహమాడారు. ఆపై విభిన్న వంటకాలపట్ల ఆసక్తిని చూపే రజనీ బెక్టర్‌ పంజాబ్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో బేకింగ్‌ విద్యను అభ్యసించారు. ఖాళీ సమయాల్లో ఐస్‌క్రీములు, కేకులు, కుకీస్‌ తయారు చేస్తుండటంతో సన్నిహితులు వ్యాపార ఆలోచనకు బీజం వేశారు. అయితే తొలినాళ్లలో నష్టాలపాలయ్యారు. ఇది గమనించిన ధరమ్‌వీర్ వ్యాపార మెళకువలు నేర్పించడంతో రూ. 20,000 పెట్టుబడితో ఐస్‌క్రిమ్‌ తయారీని ప్రారంభించారు. ఆపై నెమ్మదిగా భారీ కేటరింగ్‌ ఆర్డర్లు లభించడంతో వ్యాపారం పుంజుకుంది.  (30 రోజుల్లో 100 శాతం లాభాలు)

టర్నింగ్‌ పాయింట్
1990 మధ్య ప్రాంతంలో కుటుంబ సభ్యులు సైతం అప్పటికి క్రెమికా పేరుతో నడుస్తున్న కంపెనీలో చేరారు. ఇదేసమయంలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన గ్లోబల్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌.. బన్స్‌, సాస్‌లు తదితరాల సరఫరా కోసం క్రెమికాను ఎంచుకుంది. ఆపై క్వేకర్‌ ఓట్స్‌తో జత కట్టి క్వేకర్‌ క్రెమికా ఫుడ్స్‌ పేరుతో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రధానంగా మెక్‌డొనాల్డ్స్‌కు సరఫరా చేసేందుకు కెచప్‌లు, సాస్‌లు, మిల్క్‌ షేక్స్‌ తదితరాల తయారీని ప్రారంభించింది. 1996 తదుపరి కాలంలో బిస్కట్ల సరఫరాకు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు క్యాడ్‌బరీస్‌, ఐటీసీలకూ కస్టమర్లుగా చేసుకుంది. 1999లో జేవీ నుంచి క్వేకర్‌ ఓట్స్‌ వైదొలగడంతో కంపెనీ పేరును బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌గా మార్పు చేసింది. 2006కల్లా 30 శాతం వార్షిక వృద్ధితో రూ. 100 కోట్ల టర్నోవర్‌కు కంపెనీ చేరుకుంది. ఇదే సమయంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ 10 శాతం వాటాను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో బెక్టర్‌ ఫుడ్స్‌ విలువ రూ. 500 కోట్లను తాకింది. నిధులను గ్రేటర్‌ నోయిడా, ముంబై, హిమాచల్‌ప్రదేశ్‌ ప్లాంట్ల ఆధునికీకరణకు వినియోగించింది. 2010లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ 10 శాతం వాటాను మోతీలాల్‌ ఓస్వాల్‌కు విక్రయించింది. (క్రికెట్‌ బాల్‌ దెబ్బ- ఉదయ్‌ కొటక్‌కు భలే ప్లస్)

న్యూ జనరేషన్‌
2013లో ముగ్గురు కుమారులు అజయ్‌, అనూప్‌,అక్షయ్‌ బెక్టర్‌లకు వ్యాపార నిర్వహణను అప్పగించారు. మొత్తం టర్నోవర్‌లో 65 శాతం వాటా కలిగిన బిస్కట్స్‌, బేకరీ బిజినెస్‌ను అజయ్‌, అనూప్‌ నిర్వహిస్తుంటే.. కెచప్‌, సాస్ తదితరాల బిజినెస్‌ను అక్షయ్‌ చేపట్టారు. క్రెమికా ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో ఈ విభాగం తదుపరి కెటిల్‌ చిప్స్‌ తయారీలోకి ప్రవేశించింది. తద్వారా దేశవ్యాప్త రిటైల్‌ రంగంలోకి అడుగు పెట్టింది. కాంట్రాక్ట్‌ తయారీతోపాటు.. క్రెమికా, ఇంగ్లీష్‌ ఒవెన్‌ పేరుతో సొంత బ్రాండ్ల ద్వారా సైతం బిస్కట్స్‌, బేకరీ ఫుడ్స్‌ను బెక్టర్స్‌ ఫుడ్‌ విక్రయిస్తోంది. ప్రస్తుతం 4,000 మందికి ఉపాధినిస్తున్న కంపెనీ టర్నోవర్‌ గతేడాదికల్లా రూ. 762 కోట్లను తాకింది. ఈ ఏడాది రూ. 1,000 కోట్ల బాటలో సాగుతున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు