కరోనా ముందు స్థాయికి రుణాలు..చిన్న వ్యాపారాలకు రుణ పంపిణీ రెట్టింపు!

10 Aug, 2022 08:38 IST|Sakshi

ముంబై: మహమ్మారి కరోనా ముందటి స్థాయిలతో పోలిస్తే చిన్న వ్యాపారాలకు రుణ పంపిణీ రెట్టింపు అయ్యింది. అయితే బ్యాంకర్లు రుణ పంపిణీల విషయంలో  చాలా జాగ్రత్తగా  వ్యవహరించారు. ఇప్పటికే ఖాతాలు కలిగి ఉన్న రుణ గ్రహీతలకే తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్‌ మొగ్గు చూపింది. రుణ సమాచార కంపెనీ– సిబిల్‌ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.. 

► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నుండి రుణాల కోసం డిమాండ్‌ (వాణిజ్య క్రెడిట్‌ విచారణల సంఖ్య ప్రాతిపదికన) కరోనా ముందస్తు స్థాయితో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.6 రెట్లు పెరిగింది.  

మొత్తం ప్రత్యక్ష ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతల సంఖ్య మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 6 శాతం వృద్ధి రేటుతో 7 మిలియన్లకు చేరుకుంది. 

ఎంఎస్‌ఎంఈ విభాగంలో ఎన్‌పీఏలు మార్చి 2021 నుండి పెరుగుతున్నాయి. మహమ్మారి వల్ల సూక్ష్మ పరిశ్రమ విభాగం ఎక్కువగా దెబ్బతింది.  

వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌ల కంటే టర్మ్‌ లోన్‌ విషయంలో ఎక్కువగా పునర్‌వ్యవస్థీకరణ  జరిగింది. ఇది సానుకూల సంకేతంగా పేర్కొనవచ్చు. 

ఎంఎస్‌ఎంఈలు  క్యాష్‌ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్‌ (సీసీ, ఓడీ) రుణాల  ద్వారా తమ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) అవసరాలను నిర్వహిస్తున్నాయి.    

చదవండి👉 మరింత తగ్గనున్న మొండిబాకీల భారం

మరిన్ని వార్తలు