అంబానీ ఇంటి వద్ద కలకలం: కేసులో పురోగతి‌‌

21 Mar, 2021 10:46 IST|Sakshi

ఎస్‌యూవీ కేసులో మరింత పురోగతి

అంబానీ నివాసం వద్దకు సచిన్‌ వాజేను తీసుకెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు 

అతడు చెప్పిన వివరాల ప్రకారం క్రైం సీన్‌ రిక్రియేషన్‌

సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఎస్‌యూవీ పట్టుబడిన కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి ఎన్‌ఐఏ అధికారులు మాజీ పోలీసు సచిన్‌ వాజేను తీసుకుని అంబానీ నివాసం వద్దకు వెళ్లారు. ఆ రోడ్డును అరగంటపాటు దిగ్బంధించి వాజే చెప్పిన వివరాల ప్రకారం సంఘటనల క్రమాన్ని రిక్రియేట్‌ చేశారు. అక్కడ ఎస్‌యూవీని ఉంచిన ప్రాంతం వద్ద తెల్లటి కుర్తా ధరించిన వాజేను అటూఇటూ నడిపించి, మొత్తం ఈ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన బహుళ అంతస్తుల అంబానీ నివాసం అంటిలియా వద్ద వద్ద పేలుడు వాహనంతోపాటు అందులో హెచ్చరికతో కూడిన ఉత్తరం లభ్యమైన విషయం తెలిసిందే.

ఆ సమయంలో రికార్డయిన సీసీ ఫుటేజీలో కనిపించిన తెల్ల కుర్తా వ్యక్తి ముంబై అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేనే అని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. అయితే, ఈ విషయం ధ్రువీకరించుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, థానేకు చెందిన వ్యాపారి, స్కార్పియో యజమాని అయిన మన్సుఖ్‌ హిరేన్‌ ఈ నెల 5వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మన్సుఖ్‌ మృతికి సచిన వాజే కారణమంటూ అతని భార్య ఆరోపించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్‌) దర్యాప్తు చేస్తున్న ఈ కేసును కూడా కేంద్ర హోం శాఖ శనివారం ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఎన్‌ఐఏ అధికారుల కస్టడీలో ఉన్న వజేను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇలా ఉండగా, అంబానీ నివాసం వద్ద వాహనంలో లభించిన 20 జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుడు తీవ్రత తక్కువగా ఉంటుందనీ, వీటివల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశాలు చాలా తక్కువని ముంబైలోని కలినాలో ఉన్న ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) అధికారులు తెలిపారు. జిలెటిన్‌ స్టిక్స్‌లోని అమోనియాను విశ్లేషించాక ఈ అంచనాకు వచ్చామన్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలను బావులు తవ్వడానికి, రోడ్డు నిర్మాణ పనులు వంటి వాటిలోనే వినియోగిస్తారన్నారు. 

తమ నివేదికను రెండు రోజుల్లో ఎన్‌ఐఏకు అందిస్తామన్నారు. దీంతోపాటు, స్కార్పియో వాస్తవ ఛాసిస్‌ నంబర్‌ను కనిపెట్టి, ఆ వాహనం ఎవరి పేరిట రిజిస్టరయి ఉందో త్వరలోనే తెలుసుకుంటామన్నారు. వాహనంలోపల రక్తం, వెంట్రుకలు తదితర ఆధారాల కోసం పూర్తిస్థాయిలో శోధిస్తా మన్నారు. వీటి ఆధారంగా ఘటనా సమయంలో ఆ వాహనంలో ఎవరెవరు ప్రయాణించారు? దానిని నడిపిందెవరు? వంటి వివరాలను కూడా తెలుసుకుంటామన్నారు.  
చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం: మళ్లీ అక్కడే మరో మృతదేహం
అంబానీ ఇంటి వద్ద కలకలం: వాజే టార్గెట్‌ వంద కోట్లు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు