అంబానీ సంచలన నిర్ణయం

14 Aug, 2020 11:15 IST|Sakshi

ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటులో ముకేశ్‌ అంబానీ

వారసులకు సమాన బాధ్యతలు

వచ్చే ఏడాదికి కీలక విభాగాల బాధ్యతలు

సాక్షి, ముంబై : ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న అంబానీ తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్, ఇషా , అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్‌లో కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది.  వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

కౌన్సిల్ ఏర్పాటు  ఉద్దేశం
1973లో రియలన్స్ ను స్థాపించిన ధీరూబాయ్ అంబానీ మరణానంతరం ఇద్దరు సోదరుల (ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ) మధ్య విబేధాల కారణంగా కంపెనీ చీలిపోయింది. తండ్రి ఆశయాలకు విరుద్దంగా రెండు ముక్కలు కావడం, తదనంతర పరిణామల నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అంబానీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకుల అంచనా. తద్వారా విస్తారమైన రిలయన్స్ సంక్షోభంలో పడకుండా కాపాడటంతోపాటు, తండ్రిగా, కుటుంబ పెద్దగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా వారసుల విభేదాలకు సంబంధించి హిస్టరీ రిపీట్‌​ కాకూడదనే ప్రధాన  ఆశయంతో  అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

కాగా ముకేశ్‌, నీతా అంబానీ దంపతుల సంతానం ముగ్గురూ ఉన్నత విద్యను అభ్యసించినవారే.  వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నవారే. ఈ క్రమంలోనే 2014 అక్టోబర్‌లో ఇషా, అనంత్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లో డైరెక్టర్లుగా చేరారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో కూడా వారు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వారసుల్లో చిన్నవాడు అనంత్ ఇటీవల మార్చిలో జియో ఫ్లాట్ ఫాంలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వగా, రిలయన్స్ జియో ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో డైరెక్టర్‌గా ఇషా అంబానీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు