Reliance Industries: ముఖేష్‌ అంబానీ అదిరిపోయే ప్లాన్‌! రూ.19 లక్షల కోట్లకు రిలయన్స్‌ కంపెనీ వ్యాల్యూ!

28 Apr, 2022 07:36 IST|Sakshi

ప్రైవేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మార్కెట్‌ ఒడిదుడుకుల్లోనూ జోరు చూపుతోంది. తాజాగా బుధవారం ట్రేడింగ్‌లో తొలుత 1.9 శాతం పుంజుకుంది. కొత్త గరిష్టం రూ. 2,827ను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) తొలిసారి రూ. 19 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి రూ. 19,12,814 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజంగా ఆర్‌ఐఎల్‌ చరిత్ర సృష్టించింది. చివరికి రూ. 2,778 వద్ద షేరు ముగియడంతో మార్కెట్‌ విలువ రూ. 18,79,237 కోట్ల వద్ద స్థిరపడింది. 

జోరు తీరిలా 

ఈ ఏడాది(2022) మార్చిలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ తొలిసారి రూ. 18 లక్షల కోట్లను దాటింది. 

గతేడాది(2021) అక్టోబర్‌ 13న రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 17 లక్షల కోట్లను అధిగమించింది. 

దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కంపెనీ ఆర్‌ఐఎల్‌ యూఏఈలో టాజిజ్‌ కెమికల్‌ భాగస్వామ్య సంస్థలో 2 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో షేరు మరోసారి బలపడింది. వెరసి ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 17.3 శాతం ర్యాలీ చేసింది. 

ఓవైపు ముడిచమురు ధరలు ఊపందుకోవడంతో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) మరింత బలపడనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా పేర్కొన్నారు. మరోపక్క ప్రపంచ భౌగోళిక, రాజకీయ అస్థిర వాతావరణంలోనూ టెలికం బిజినెస్‌ స్థిరంగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇక రిటైల్‌ బిజినెస్‌లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు సహకారంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ఇటీవల పునరుత్పాదక ఇంధన బిజినెస్‌వైపు భారీ ప్రణాళికలు వేయడం కూడా కంపెనీకి బలాన్నిస్తున్నట్లు వివరించారు.   

చదవండి👉అదానీనా మజాకానా.. ముఖేష్‌ అంబానీకి భారీ షాక్‌..!

మరిన్ని వార్తలు