వ్యాపారవేత్తలకు అవకాశాల సునామీ

26 Mar, 2021 05:13 IST|Sakshi

రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడి

ముంబై: ప్రైవేట్‌ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ మరింత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశాలు సునామీలా వెల్లువెత్తగలవని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టెక్నాలజీలు అందుబాటులో ఉండటం కూడా ఇందుకు దోహదపడగలదని ఈవై ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలోనే టాప్‌ 3 ఎకానమీల్లో ఒకటిగా నిల్చేందుకు భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయి. పర్యావరణ అనుకూల ఇంధనాలు, విద్య, వైద్యం, బయోటెక్నాలజీ, సర్వీసులు వంటి వివిధ రంగాల్లో అసాధారణ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి‘ అని అంబానీ తెలిపారు. భారత్‌ ఆర్థికంగా, ప్రజాస్వామ్యపరంగా, దౌత్య విధానాలపరంగా, సాంస్కృతిక కేంద్రంగా ముందుకు దూసుకెడుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.   

మరిన్ని వార్తలు